
ఎండ వేడిమి నుండి ఉపశమనం కోసం వాడే కూలరే ఆ మహిళ పాలిట మృత్యుపాశంగా మారింది. నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఊహించని ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కడెం మండలం పాత మద్దిపడగ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కారం సుశీల అనే 55 ఏళ్ల మహిళ, ఇంట్లోని ఉక్కపోత భరించలేక కూలర్ ఆన్ చేశారు. కూలర్ రన్ అవుతుండగానే, అందులో నీళ్లు పోసేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో కూలర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఆమె ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
కరెంట్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సుశీల అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంతో పాత మద్దిపడగ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
వేసవి కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువు, ముఖ్యంగా ఐరన్ బాడీ ఉన్న కూలర్ల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూలర్ ఆన్‌లో ఉన్నప్పుడు నీళ్లు పోయడం తడి చేతులతో స్విచ్‌లు వేయడం ప్రాణాపాయానికి దారితీస్తుందని సూచిస్తున్నారు.