
ఇథియోపియాలో రెండు రోజుల పర్యటన తరువాత భారత ప్రధాని నరేంద్ర మోడీ అడ్డీస్ అబాబా నుంచి ఒమన్‌కు బుధవారం బయలుదేరి వెళ్లారు. నాలుగు దేశాల పర్యటన ముగింపు దశలో ఆయన ఈ ప్రముఖ అరబీ దేశ పర్యటన తలపెట్టారు. ఇథియోపియా ప్రధాని అబియ్ అమ్‌మద్ అలీ స్వయంగా కారు నడుపుతూ మోడీని విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రధానుల మధ్య సరదాగా సంభాషణ సాగింది. ప్రధాని మోడీ సామాజిక మాధ్యమంలో ఇథియోపియా పర్యటన తనకు ఆత్మీయ అనుభవం పంచిందని తెలిపారు. ఇక ఒమన్‌కు బయలుదేరిన ఫోటోలను పొందుపర్చారు.
ఇక ప్రధాని మోడీ ఒమన్ సర్వాధికార పాలకుడు సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ ప్రత్యేక ఆహ్వానంపై ఒమన్ పర్యటన తలపెట్టారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, అమెరికా నుంచి సుంకాల భారం ఇతర పరిణామాల నేపథ్యంలో ఒమన్ పర్యటన భారత్‌కు కీలకం అయింది. ఇరుదేశాల మధ్య 70 ఏండ్లుగా సాగుతోన్న స్నేహ బంధం వార్షికోత్సవం దశలో ఇరువురు నేతల మధ్య చర్చలకు ప్రాధాన్యత ఉంది. ఒమన్‌లోని భారతీయ సంతతి వారితో కూడా ప్రధాని మోడీ ఇష్టాగోష్టి ఉంటుంది. ఒమన్‌కు వెళ్లడం మోడీకి ఇది రెండోసారి.