Reading Time: < 1 minute
TG Inter 2026 Admissions: జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభం.. ఆలోపే అడ్మిషన్లు పూర్తి

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను సోమవారం (మార్చి 30) విడుదల చేసింది. తాజా క్యాలెండర్‌ ప్రకారం జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభమవుతాయి. దీంతో ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు తరగతులు జూన్‌ నెల ఆరంభం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాదికి మొత్తం 224 పని దినాలపాటు కాలేజీలు నడపాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తామని కృష్ణ ఆదిత్య వెల్లడించారు.

అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 22న తిరిగి కాలేజీలు తెరుచుకుంటాయి. ఈ సెలవులకు ముందు అక్టోబర్ 3 నుంచి 9 మధ్య హాప్‌ ఇయర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇక సంక్రాంతి పండక్కి బోర్డు ఐదు రోజుల సెలవులు ప్రకటించింది. జనవరి 13, 2027 నుంచి జనవరి 17, 2027 వరకు ఈ సెలవులు ఉంటాయి. సెలవుల అనంతరం జూనియర్ కాలేజీలు జనవరి 18, 2027న తిరిగి తెరుచుకుంటాయి. సెలవుల తరువాత ప్రీ-ఫైనల్ పరీక్షలు జనవరి 18, 2027 నుంచి 23, 2027 వరకు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 2027 చివరి వారంలో జరుగుతాయి. ఇక ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 2027 చివరి వారంలో మొదలవుతాయి.

2026-27 విద్యా సంవత్సరంలో మార్చి 27, 2027ని చివరి పనిదినంగా నిర్ణయించారు. ఇంటర్‌ విద్యార్థులకు మార్చి 28, 2027 నుంచి మే 30, 2027 వరకు వేసవి సెలవులు ఉంటాయి. మే 2027 మూడవ వారంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ఇక వేసవి సెలవుల అనంతరం 2027-28 విద్యా సంవత్సరానికి మే 31, 2027న తిరిగి కాలేజీలు తెరచుకుంటాయి. ఇంటర్‌ బోర్డు ప్రకటించిన ఈ షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు జరగాలని కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. అకడమిక్‌ క్యాలెండర్‌లోని సెలవులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలను కూడా కచ్చితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్‌ కాలేజీలు పాటించాలని ఆయన అన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.