
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు కనిపిస్తోంది. గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) కు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
మొత్తం 293 స్థానాలకు గాను బీజేపీ 171 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్కును బీజేపీ ఈజీగా దాటేలా కనిపిస్తోంది. సాధారణంగా ఉత్తర బెంగాల్‌లోనే బలంగా ఉండే బీజేపీ, ఈసారి మమతా బెనర్జీ కంచుకోట అయిన దక్షిణ బెంగాల్ లో కూడా పాగా వేసింది. జాదవ్‌పూర్, హౌరా, ముర్షిదాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
మమతా బెనర్జీకి షాక్:
స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానిపూర్ లో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే టీఎంసీకి పట్టున్న డైమండ్ హార్బర్ సీటులో కూడా బీజేపీ ముందంజలో ఉంది.
ఎన్నికల హైలెట్స్:
ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా 92.47 శాతం ఓటింగ్ నమోదైంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా నియోజకవర్గంలో గొడవల కారణంగా ఓటింగ్ రద్దయింది. అక్కడ మే 21న మళ్ళీ పోలింగ్ జరగనుంది.
బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు రంగంలోకి దిగి అవినీతి, మహిళల భద్రత, నిరుద్యోగం వంటి అంశాలపై పోరాడారు. మరోవైపు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సంక్షేమ పథకాలను నమ్ముకుని ప్రచారం చేశారు.
ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే, బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీఎంసీ కంచుకోటలను బద్దలు కొడుతూ బీజేపీ మొదటిసారి బెంగాల్ గడ్డపై అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది.