
ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అనుబంధాలు ఆవిరవుతున్నాయి. స్వార్థం, గర్వం, అహంకారం, ఆధిపత్యం, అత్యాశ, అసూయ వంటి లక్షణాలతో పాటు కాలం తెచ్చే మార్పులూ ఈ పరిస్థితికి కారణాలే. వీటి వల్ల మనల్ని ప్రేమించే, అభిమానించే మనుషుల్ని కోల్పోవడం ఎంతో బాధాకరం. ఇక మనతో బంధం, అనుబంధం ఉన్నవాళ్లను చేజార్చుకుంటే కలిగే వేదన చెప్పలేనిది.
దురదృష్టవశాత్తూ ఇలాంటి దుస్థితి సమాజంలోకి డబ్బు జబ్బు వచ్చాక బాగా ఎక్కువైంది. ఇలాంటి సంఘటనల చుట్టూ అల్లుకున్న కథల సమాహారమే ‘జీవిత పాఠం’ పుస్తకం.ఈ పుస్తకంలో 12 కథలున్నాయి. ఇవన్నీ వివిధ పత్రికలు, ఇతర మాధ్యమాల్లో ప్రచురితమై ఆదరణ పొందినవే. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయో చెబుతూనే వాటిని తిరిగి ఏ విధంగా నిలుపుకోవాలో చెప్పడం ఈ కథల ప్రత్యేకత.
వీటిలోని ఇతివృత్తాలు కేవలం కుటుంబం వరకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రకృతితో మమేకమై ఉన్న మన జీవితాలనూ స్పృశిస్తాయి. ‘వేపచెట్టు’, ‘పోచమ్మ చెరువు’, ‘గునుగు తంగేడు పూలు’ కథలు ఇలాంటివే.
పాత ఇంటి స్థానంలో కొత్తది కట్టాలనుకున్నప్పడు, అప్పటికే అక్కడ ఉన్న చెట్టును తొలగిస్తారేమోనని శిశిర్ అనే పిల్లవాడు పడే ఆవేదనకు అక్షర రూపం ‘వేపచెట్టు’. కల్మషం లేని కుర్రాడు ఆ చెట్టుపై పెంచుకున్న ప్రేమ, అతడి తల్లిదండ్రులనే కాదు పాఠకులనూ ఆలోచింపచేస్తుంది.
ఇక తన బాల్యంతో పెనవేసుకున్న చెరువును కబ్జా చెరలో పడకుండా ఓ యువకుడు ఎలా కాపాడుకున్నాడో ‘పోచమ్మ చెరువు’ చెబుతుంది. చెరువు కనుమరుగైతే ఊరు జీవం కోల్పోతుందని, అలా జరగకూడదని ఆ యువకుడు పోరాడే తీరు ఆకట్టుకుంటుంది. తన పొలం, బతుకమ్మ పండుగపై అపారమైన ప్రేమనుపెంచుకున్న వరాలు కథ ‘గునుగు తంగేడు పూలు’. రైతాంగ పోరాటం ముగిశాక, మళ్లీ ఊరొచ్చి, అప్పులతో వలవేసి, పొలాలన్నింటినీ కబళిస్తున్న నయా దొర నుంచి తన భూమిని కాపాడుకునేందుకు వరాలు పడే తపన స్ఫూర్తినిస్తుంది.
రైలు ప్రయాణంలో ఎదురైన యువకుడిని మొదట అపార్థం చేసుకున్నా, చివరికి అతని ఆశయానికి తన వంతు తోడ్పాటు అందించిన ధనవంతుడి కథ ‘జీవిత అర్థం’. కోట్ల సంపాదనలోనూ లేని సంతోషం కాస్త సాయంలో ఉంటుందనే సందేశాన్ని ఇస్తుంది. ఇద్దరు చిన్నారుల స్నేహం కోణంలో సాగే ‘ఆన్లైన్ క్లాసులు’ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. అత్త అంటేనే అసహ్యించుకునే ఓ కోడలు చివరకు ఆమెలో అమ్మను చూసుకునేలా మారడాన్ని ‘అత్తమ్మ’ చెబుతుంది.
కాలానికి తగినట్లు తనను మలచుకొని, ఒంటరిగా జీవించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పెంచుకున్న అత్త పాత్ర చిత్రణ బాగుంది. గయ్యాళి భార్యకు జడిసి, కన్నతండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించిన ఓ కుమారుడు.. చివరికి తన తప్పును ఎలా సరిదిద్దుకున్నాడో చెప్పే కథ ‘జీవిత పాఠం’. తమ కోసం సర్వం ధారపోసే తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో కష్టపడకుండా చూసుకోవడం పిల్లల బాధ్యత అని, దాని కోసం అవసరమైన త్యాగానికీ సిద్ధపడాలని ఈ కథ బోధిస్తుంది.
సమాజంలో ఎంతో మందిని తీర్చిదిద్దే గొప్ప పని కోసం చిన్న చిన్న సంతోషాలను, కుటుంబంతో గడిపే విలువైన క్షణాలను కాదనుకొన్న ఓ ఉపాధ్యాయుడి కథే ‘గురు బ్రహ్మ’. ఇద్దరి మధ్య బంధాన్ని విడదీయాలని చూసేవాళ్లు ఎక్కువవుతున్న ఈ కాలంలో తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా ఒక జంటను కలిపేందుకు తాపత్రయపడిన లాయరు కథ ‘మాలతి అక్కయ్య’. ఆటిజంతో బాధపడే చిన్నారిని దత్తత తీసుకొని, ఆ చిట్టితల్లిని తీర్చిదిద్దిన ఓ టీచరు కథ ‘అగ్గిపుల్ల’.
రియల్ ఎస్టేట్ మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుకున్న యువకుల కథ ‘రైతే రారాజు’. పైకెదగడానికి చేసే తప్పులు జీవితాంతం వెంటాడుతాయని చెప్పే‘ప్రాణ మిత్రుడు’ కథలు కూడా విలువలను బోధించేవే.పుస్తకంలో భాష సరళంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో సాగింది. తెలంగాణ మాండలికం తళుక్కుమంటుంది. కథలన్నీ సానుకూల దృక్పథంతో ముగియడం బాగుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హాయిగా చదివేలా ఉంది ఈ పుస్తకం.
– మహేశ్వర్–
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ : openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.