
- కాలనీ ప్రెసిడెంట్ దంపతులపై కేసు
ఓల్డ్‌సిటీ, వెలుగు: మీర్పేట్ పరిధిలోని శివ నారాయణపురం వైష్ణవి కాలనీలో చిట్టీల పేరుతో కాలనీ ప్రెసిడెంట్ సురేశ్ కుమార్, అతని భార్య సుమారు రూ. 2 కోట్ల మోసానికి పాల్పడ్డారు. గత పదేండ్లుగా నమ్మకంగా చిట్టీలు నడుపుతూ స్థానికుల ఆదరణ పొందిన ఈ దంపతులు.. ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని గత కొంతకాలంగా 25 మందికి పైగా బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేశారు.
చిట్టీ గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ చెక్కులు, ప్రామిసరీ నోట్లతో కాలయాపన చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.2 కోట్లు మోసం చేశారని బాధితులు ఆదివారం మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బండారి శోభన్ తెలిపారు.