
హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న పార్కులు, ఫుడ్ కోర్టులు, బేకరీలపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మొత్తం 81 ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ సోదాల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆహారం తయారు చేసే కిచెన్ పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల కనీస నిబంధనలు పాటించకుండా, ఎక్స్‌పైరీ డేట్ ముగిసిపోయిన ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్ముతున్నట్లు తేలింది.
పలు ప్రముఖ బేకరీల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాలపై అనుమానం రావడంతో, అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ టెస్టుల కోసం పంపారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 14 సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్పటికప్పుడు నోటీసులు జారీ చేశారు.
కేవలం దాడులు చేయడమే కాకుండా, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు నిబంధనలపై అధికారులు అవగాహన కల్పించారు. రా మెటీరియల్స్ ప్యాకింగ్‌పై సరైన లేబెలింగ్ ఉండాలని, ఆహార పదార్థాల నిల్వ , సంరక్షణలో మార్గదర్శకాలు పాటించాలని దిశానిర్దేశం చేశారు. పెస్ట్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో FSSAI నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.