
శ్రీశైలం క్షేత్రంలో ప్రముఖంగా చెప్పుకునే ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. గత కొన్ని రోజులుగా అటవీశాఖ సిబ్బందికి, స్థానిక చెంచు డ్రైవర్లకు మధ్య ఉన్న వివాదాన్ని మార్కాపురం జిల్లా అటవీశాఖ అధికారి మహమ్మద్ అబ్దుల్ రవుఫ్ పరిష్కరించారు.
సోషల్ మీడియాలో ఈ వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో మహమ్మద్ అబ్దుల్ రవుఫ్ తక్షణమే స్పందించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించిన ఆయన ఇరు వర్గాలతో చర్చలు జరిపి వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. ఈ సందర్భంగా డి.ఎఫ్.ఓ అబ్దుల్ రవుఫ్ మాట్లాడుతూ.. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అటవీశాఖ సిబ్బంది, డ్రైవర్ల మధ్య సమస్యలు తొలగిపోయాయని, భక్తులు ఇకపై యథావిధిగా ఇష్టకామేశ్వరి దేవిని దర్శించుకోవచ్చని ఆయన వెల్లడించారు.వదంతులను నమ్మవద్దని, సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.