Reading Time: 2 minutes

వాస్తవం ఇదేగా.. ప్రజలే నిజమైన విజేతలు.. పౌరుల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు..!

Caption of Image.

సింహపురిని పాలించే విక్రమ వర్మ వృద్ధుడయ్యాడు. ఆయన తన కొడుకు జయకేతుకి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి  తీసుకోవాలనుకున్నాడు. ఆ మాట మంత్రి మహేంద్రునితో చెప్పాడు. దానికి మంత్రి ‘‘ప్రభూ! పట్టాభిషేకానికి ముందు యువరాజు లోకజ్ఞానం పొందడానికి దేశాటన చేయడం మన ఆచారం” అన్నాడు. అందుకు విక్రమవర్మ ‘‘సరే’’నన్నాడు. 

ఒకరోజు జయకేతు మారువేషంలో బయలుదేరి చెన్నపల్లి అనే గ్రామం చేరాడు. ఆ రాత్రి రామయ్య అనే రైతు ఇంట్లో బస చేశాడు. ఆయన తనకున్నంతలో భోజనం పెట్టి పడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. పడుకోబోయే ముందు మాటల్లో ‘రామయ్య చిన్న రైతు అని ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని చెప్పాడు.

తండ్రి చిన్నవయసులోనే చనిపోయాడు. రామయ్య అధైర్యపడక తమకున్న రెండెకరాల పొలంలోనే శ్రమిస్తూ అతివృష్టి, అనావృష్టిలను తట్టుకుంటూ వచ్చే కొద్ది ఆదాయంతోనే ముగ్గురు తమ్ముళ్లను ప్రయోజకులను చేశాడు. ఒక ఇంటివారిని చేశాడు. అలానే ఇద్దరు చెల్లెళ్లకు తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. తండ్రి లేకపోయినా తండ్రి బాధ్యతలన్నీ తాను నెరవేర్చానన్న తృప్తితో జీవిస్తున్నాడు’ అని తెలుసుకున్నాడు. 

దాంతో జయకేతు రామయ్య త్యాగబుద్ధికి ఆశ్చర్యపోయాడు. ఉదయాన్నే రామయ్యకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాడు. పగలంతా  నడుస్తూ రాత్రికి రత్నవరం అనే గ్రామం చేరాడు. అక్కడ అతనికి మణిగుప్తుడనే ఒక చిన్న వ్యాపారి ఆతిథ్యం ఇచ్చాడు. ఒకప్పుడు వ్యాపారంలో బాగా సంపాదించిన ఆ వ్యాపారి తన సంపాదన అంతా పెట్టుబడి పెట్టి మరో కొత్త వ్యాపారం చేయబోయాడు.

 కాలం కలిసిరాలేదు. సరుకుతో పోయిన పడవ తుఫానులో చిక్కుకుంది. సరుకంతా సముద్రం పాలైపోయింది. అయినా ఆ వ్యాపారి కుంగిపోక మళ్లీ చిన్నవ్యాపారాన్ని ప్రారంభించి జీవనం సాగిస్తున్నాడు. అతని గుండె ధైర్యానికి జయకేతు అబ్బురపడ్డాడు. 

ఉదయాన్నే బయలుదేరి కొత్త ప్రాంతాలను చూస్తూ రాత్రికి మణిపురం అనే గ్రామం చేరాడు. ఆ ఊరిలో పండితుడు సోమశర్మ పరిచయమయ్యాడు. జయకేతును  తన ఇంటికి అతిథిగా తీసుకెళ్లాడు. ఆయన ఇంటినిండా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఆయన మాటల్లో గొప్ప పాండిత్యం జయకేతుకు కనిపించింది. ‘‘ఇంత గొప్ప పండితులు మారుమూల గ్రామంలో పేరు ప్రఖ్యాతులు లేకుండా ఉన్నారేంటి? రాచకొలువులో మీలాంటి వారి ప్రతిభ రాణిస్తుంది కదా!” అన్నాడు జయకేతు. 

‘‘అయ్యో! కొలువా? ఇప్పటివరకు రాజధానికి వెళ్లి రాజదర్శ నం కోసం ఎంతో ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇంతవరకు లభించలేదు. అయినా నిరాశపడను. పట్టు వదలను. ప్రయత్నం చేస్తూనే ఉంటాను” అన్నాడు నిబ్బరంగా.   యువరాజు అక్కడనుంచి బయలుదేరి అనేక ప్రాంతాలు చూస్తూ కొంతకాలానికి తిరిగి రాజధాని చేరాడు.

విక్రమవర్మ జయకేతుకి ఘనంగా పట్టాభిషేకం చేశాడు. కొత్తరాజు కదా తేలిగ్గా జయించవచ్చు అనుకుని హఠాత్తుగా పొరుగు రాజు సింహపురి మీద దాడి చేశాడు. జయకేతు సైన్యాన్ని సిద్ధం చేసి దాడిని ఎదుర్కొని పొరుగు రాజును చిత్తుగా ఓడించాడు. పొలిమేర దాకా తరిమేశాడు. 

విక్రమవర్మ కొడుకును ఘనంగా సన్మానించాలి అనుకున్నాడు. దానికి జయకేతు ‘‘నాన్నా! నేను యుద్ధంలో విజయం సాధించి ఉండొచ్చు. నాకు వారసత్వంగా రాజ్యం వచ్చింది. వీరులైన సైన్యం సహకారంతో నాకు విజయమూ లభించింది. కానీ, రాజ్యంలోని ప్రజలకు ఇవేమీ లేవు. అయినా వాళ్లు జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ధైర్యంతో జీవితాన్ని సాగిస్తున్నారు. వాళ్ల జీవనమూ యుద్ధం లాంటిదే.

ఆత్మవిశ్వాసంతో విధికి ఎదురీదుతూ ధైర్యంతో ఒంటరిగా విజయాలు సాధిస్తున్నారు. వాళ్లే నిజమైన విజేతలు. వాళ్లకే ముందుగా సన్మానాలు అందాలి’’ అంటూ తనకెదురైన అనుభవాలను తండ్రికి వివరించాడు జయకేతు. అతని మంచితనానికి లోక జ్ఞానానికి విక్రమవర్మ ఆనందించాడు. ప్రజలకు మంచి రాజు లభించాడని సంబరపడ్డాడు. 

రైతును, వర్తకుడ్ని, పండితుడ్ని రాజధానికి పిలిపించి ఘనంగా సత్కరించాడు. పండితునికి కొలువులో చోటిచ్చాడు. అంతేగాక రాజ్యంలో నిత్యం  జీవితం అనే యుద్ధరంగంలో సమస్యలతో పోరాడుతూ విజయం సాధించే వాళ్లని గుర్తించి ఏటా సత్కరించటం ప్రారంభించాడు. 

– డా. గంగిశెట్టి శివకుమార్ –
 

©️ VIL Media Pvt Ltd.