Reading Time: 2 minutes

యూట్యూబర్ జర్నీ: నాలుగు గోడల మధ్య కార్పొరేట్ జాబ్ నచ్చలే.. అందుకే లగ్జరీ లైఫ్ వదిలేసి..

Caption of Image.

నాలుగు గోడల మధ్య కార్పొరేట్ ఉద్యోగం చేయడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి.. మంచు పర్వతాలు ఎక్కడంలోనే అసలైన సంతోషాన్ని వెతుక్కుంది ప్రకృతి వర్ష్​ణే. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాగ్రాన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తొలి భారతీయ ‘వీగన్’ మహిళగా చరిత్ర సృష్టించింది. 

ప్రకృతి వర్ష్​ణే ఢిల్లీలో పుట్టి, పెరిగింది. ఫైనాన్స్‌‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొంతకాలం కార్పొరేట్ జాబ్ చేసింది. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇష్టంలో ఆ రంగంలోకి అడుగుపెట్టింది. కానీ.. ఆమెకు 9–5 జాబ్ లైఫ్ నచ్చలేదు. ఏదో తెలియని అసంతృప్తి ఎప్పుడూ వెంటాడేది. అందుకే ట్రావెలింగ్ మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే ప్రకృతికి పర్వతారోహణ మీద ఇష్టం పెరిగింది. ఆమె 2016 చలికాలంలో స్పితి వ్యాలీకి రెండు నెలల ట్రిప్‌‌కు వెళ్లింది.

ఆ ట్రిప్‌‌ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అందమైన ల్యాండ్‌‌స్కేప్‌‌లు, అక్కడి ప్రజలు, సంస్కృతి, వాళ్ల  లైఫ్​స్టయిల్‌‌ చూసి తాను అలాంటి వాతావరణంలోనే ఉండాలి అనుకుంది. వెంటనే 2016 డిసెంబర్ 25న ఉద్యోగానికి రాజీనామా చేసింది. అప్పటినుంచి మంచు కొండల్లో కొత్త అందాలను అన్వేషిస్తూ ఫుల్‌‌టైం అడ్వెంచర్‌‌ ట్రావెలింగ్‌‌ చేస్తోంది. 

యూట్యూబ్ జర్నీ

ప్రకృతి కేవలం ట్రెక్కర్‌‌‌‌ మాత్రమే కాదు, తన అనుభవాలను ప్రపంచంతో పంచుకుంటూ లక్షలాది మందికి స్పూర్తినిస్తున్న ఒక సక్సెస్‌‌ఫుల్ యూట్యూబర్. ఆమె ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలను, హిమాలయాల అందాలను ఇతరులకు చూపించాలనే ఉద్దేశంతో వీడియోలు చేయడం మొదలుపెట్టింది. వాటిని కొన్నేండ్ల క్రితమే తన పేరుతో క్రియేట్‌‌ చేసిన యూట్యూబ్‌‌ చానెల్‌‌లో, ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్‌‌లో పోస్ట్‌‌ చేస్తోంది. 

సాదాసీదాగా.. 

చాలామంది ట్రావెల్ వ్లాగర్లతో పోలిస్తే ప్రకృతి చేసే వీడియోలు భిన్నంగా ఉంటాయి. వీడియోల్లో కేవలం అందమైన లొకేషన్లు, ఖరీదైన హోటళ్లు కాకుండా స్థానిక ప్రజల ఇళ్లలో ఉంటూ, వాళ్ల సంస్కృతిని చూపిస్తుంది. వీడియోల్లో అతి తక్కువ ఖర్చుతో పర్వత ప్రాంతాల్లో ఎలా ట్రావెల్‌‌ చేయాలో వివరిస్తూ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. అందుకే ఆమె చేసే ట్రెక్కింగ్ వ్లాగ్స్, మౌంటైన్ లైఫ్, డైలీ వ్లాగ్స్ వీడియోలకు వ్యూస్‌‌ ఎక్కువగా వస్తున్నాయి. 

►ALSO READ | కిచెన్ తెలంగాణ: బయట ఐస్క్రీమ్స్ కూడా కల్తీ అవుతున్నయ్.. అందుకే ఫ్రూట్ ఐస్ క్రీమ్లు.. ఇలా ఇంట్లో చేస్కోండి!

ఎన్నో సవాళ్లు

జాబ్ వదిలేసిన తర్వాత ఆదాయం లేకపోవడంతో ప్రకృతి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. మరోవైపు యూట్యూబ్‌‌ నుంచి డబ్బు వస్తుంది అనుకుంటే వీడియోలకు పెద్దగా రీచ్‌‌ రాలేదు. పైగా ట్రావెలింగ్‌‌లో ఉన్నప్పుడు మాత్రమే వీడియోలు చేస్తుండడం వల్ల రెగ్యులర్‌‌‌‌గా అప్‌‌లోడ్‌‌ చేయలేకపోయింది. దాంతో సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్య పెరగలేదు. అయినా ప్రకృతి నిరుత్సాహపడలేదు. హిమాలయాల్లోని మారుమూల గ్రామాల్లో, పర్వత శిఖరాలపై ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వీడియోలు రికార్డ్ చేసి, నెట్‌‌వర్క్ ఉన్న ప్లేస్‌కు వెళ్లి అప్‌‌లోడ్ చేసేది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ చానెల్‌‌కు 42 వేల మంది సబ్‌‌స్క్రయిబర్లు మాత్రమే ఉన్నారు. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో మాత్రం ఆమెను 1.74 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

ఎవరెస్ట్‌‌ ఎక్కిన మొదటి వీగన్​

ప్రకృతి 2022లో ఎవరెస్ట్‌‌ను అధిరోహించి రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేసింది. ఆ పర్వాతాన్ని ఎక్కిన భారతదేశపు మొదటి వీగన్‌‌(జంతు సంబంధిత ఆహారం తీసుకోకపోవడం) మహిళ ఆమె. దాంతో ప్రకృతి చాలా ఫేమస్‌‌ అయ్యింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి శిఖరం వరకు ప్రయాణంలో ఆమె చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. పర్వతారోహణలో ఉండే అసలైన కష్టాలను, ప్రాణాపాయ స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించింది. పర్వత ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిరసిస్తూ, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తన వ్లాగ్స్ ద్వారా అవగాహన కల్పించింది. ఒంటరిగా ప్రయాణించాలనుకునే అమ్మాయిలకు సేఫ్టీ టిప్స్‌‌ ఇస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతోంది. 

©️ VIL Media Pvt Ltd.