Reading Time: 3 minutes

ప్లాస్టిక్ సమస్యకు గ్రోఇట్‌ సొల్యూషన్.. రైతులకు సాయం చేయాలనే..

Caption of Image.

ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఫ్యామిలీ బిజినెస్‌‌లో చేరి లాభాలు తీసుకొచ్చాడు అక్షయ్‌‌. కానీ.. మన దేశంలో వ్యవసాయ పద్ధతులను చూసి బాధపడ్డాడు. మన దగ్గర చాలామంది రైతులు ప్లాస్టిక్‌‌ని సరైన, సురక్షితమైన పద్ధతిలో వాడడం లేదు. దాంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కరాన్ని కనుక్కోవాలి అనుకున్నాడు. ఆ దృఢ సంకల్పంతోనే ‘గ్రోఇట్’ అనే స్టార్టప్‌‌ పెట్టాడు. దాని ద్వారా అధునాతన ప్రొటెక్టివ్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్‌‌ని అందిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మారుస్తున్నాడు. 

సూరత్‌‌కు చెందిన అక్షయ్ అగర్వాల్ మసాచుసెట్స్ యూనివర్సిటీలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2014లో ఇండియాకు తిరిగొచ్చాడు. అప్పటికే వాళ్ల కుటుంబం ప్యాకేజింగ్ బిజినెస్‌‌లో ఉంది. అతను కూడా అందులోనే చేరి, వ్యాపారాన్ని డెవలప్‌‌ చేశాడు. అయితే.. ఇండియా వచ్చిన కొత్తలోనే ఒక విషయాన్ని గమనించాడు. మన దగ్గర వ్యవసాయంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా ఉంది. కానీ.. వాళ్లలో 2 శాతం మంది మాత్రమే సరైన పద్ధతుల్లో సేఫ్‌‌గా వాడుతున్నారు.

అదే చైనా, అమెరికా లాంటి దేశాల్లో 70 నుంచి 80 శాతం మంది రైతులు సేఫ్​ మెథడ్స్​లో ప్లాస్టిక్‌‌ను వాడుతున్నారు. మన దగ్గర రైతుల్లో మార్పు రాకపోతే పర్యావరణానికి  విపరీతంగా నష్టం కలుగుతుందని తెలుసుకున్నాడు అక్షయ్‌‌. అందుకే అప్పటినుంచి తన అన్న సౌరభ్ అగర్వాల్‌‌తో కలిసి దీనిపై మరింత లోతుగా రీసెర్చ్‌‌ చేశాడు. ఆ తర్వాత ఇండియన్‌‌ క్లైమెట్‌‌‌‌కు సరిపోయే అగ్రికల్చర్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌ తయారు చేయాలనే ఉద్దేశంతో 2020లో ‘గ్రోఇట్’ అనే స్టార్టప్‌‌ని స్థాపించాడు. 

రైతులకు సాయం చేయాలనే.. 

‘‘మాది వ్యవసాయ కుటుంబం కాదు. కానీ.. మాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే సాగు పద్ధతుల గురించి తెలుసుకునేవాళ్లం. ఆ క్రమంలోనే ఎంతోమంది రైతులు ప్లాస్టిక్‌‌ మల్చింగ్‌‌ కవర్లు వాడి ఇబ్బంది పడుతున్నారని గుర్తించాం. అలాంటివాళ్లకు సాయం చేసేందుకు ఈ రంగంలోకి వచ్చాం. అప్పటినుంచి రైతులకు ప్రొటెక్టివ్‌ ఫార్మింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ఈ పద్ధతిలో మొక్కల పెరుగుదలకు అనుగుణంగా టెంపరేచర్‌‌, తేమ, నీటి శాతాన్ని నియంత్రిస్తూ సాగు చేస్తారు.

దీనివల్ల నీరు, ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గి, పంట ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది కలుపు మొక్కల పెరుగుదలను తగ్గించి, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను, దిగుబడిని పెంచుతుంది. ఫలితంగా రైతులకు మెరుగైన రాబడి వస్తుంది. ఇలాంటి సాగుకు అవసరమయ్యే అన్ని రకాల ప్రొడక్ట్స్‌‌ని మేం అందిస్తున్నాం” అంటున్నాడు అక్షయ్.

నేరుగా రైతుకే.. 

సాధారణంగా ఒక సప్లై చైన్‌‌లో తయారీదారులు తమ ఉత్పత్తులను డీలర్లకు, వాళ్లు చిల్లర వ్యాపారులకు అమ్ముతుంటారు. వాళ్ల నుంచి రైతులు కొంటారు. కానీ.. గ్రో ఇట్‌‌ ప్రొడక్ట్స్‌‌ని రైతులు నేరుగా కంపెనీ నుంచే కొనుక్కోవచ్చు. ‘మేము మా వినియోగదారులతో నేరుగా మాట్లాడుతాం. మా ప్రొడక్ట్స్‌‌ గురించి వివరంగా చెప్తాం” అని చెప్పాడు అక్షయ్‌‌. సప్లై చైన్‌‌ని పెంచుకోవడానికి అక్షయ్‌‌, సౌరభ్​లు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నారు. అంతేకాదు..  గ్రో ఇట్ కేవలం వస్తువులను అమ్మడమే కాదు.. ‘సాయిల్ టు -హార్వెస్ట్’ అనే ట్యాగ్‌‌లైన్‌‌తో ముందుకెళ్తోంది. అంటే.. మట్టిలో విత్తనం నాటే ముందు నుంచి కోత కోసే వరకు రైతుకు అన్ని విధాలుగా సపోర్ట్‌‌ అందిస్తోంది. గ్రో ఇట్​ అందిస్తున్న కొన్ని ప్రొడక్ట్స్‌, సర్వీస్‌లు…

మల్చింగ్ ఫిల్మ్స్: ఇవి నేలలో తేమను నిలిపి ఉంచి, కలుపు మొక్కల పెరుగుదలను అరికడతాయి.

క్రాప్ కవర్లు, షేడ్ నెట్స్: తీవ్రమైన ఎండ, వర్షం, పురుగుల నుంచి పంటలను రక్షిస్తాయి.

సాయిల్ గురు ప్రో: ఇది మట్టిని పరీక్షించి, ఏ నేలకు ఏ పంట సరిపోతుందో సూచించే గాడ్జెట్‌‌.

అగ్రోనమీ సర్వీస్‌‌లు: నిపుణులైన శాస్త్రవేత్తల ద్వారా రైతులకు నిరంతరం సలహాలు అందిస్తారు.

12 రాష్ట్రాల్లో.. 

గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌‌గఢ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా రైతులకు సేవలు అందించారు. ఆ రైతుల పంట దిగుబడి 20-50 శాతం వరకు పెరిగింది. కంపెనీకి ఇప్పటివరకు 650కి పైగా ఫ్రాంచైజీ స్టోర్లు ఉన్నాయి. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్-2లో అక్షయ్‌‌, సౌరభ్‌‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌‌ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం లాభాల గురించి మాత్రమే కాకుండా, రైతు సంక్షేమంపై వాళ్లు మాట్లాడిన తీరుకు ఫిదా అయిన కొంతమంది ఇన్వెస్టర్లు ఈ స్టార్టప్‌‌లో రూ. కోటి వరకు పెట్టుబడి పెట్టారు.

రైతు రాకేష్ గుండ్రాసియా ప్రతి సంవత్సరం 50 ఎకరాల్లో పుచ్చకాయ పంట వేస్తున్నాడు. పంటలో కలుపు మొక్కలను నివారించడానికి, తేమ శాతాన్ని పెంచేందుకు, మైక్రో క్లైమేట్‌‌ని క్రియేట్‌‌ చేసేందుకు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లను రక్షణ కవచాలుగా వాడేవాడు. కానీ.. అవి తరచుగా చిరిగిపోయేవి. దాంతో అక్కడక్కడ కలుపు మొక్కలు పెరిగేవి. పైగా ప్లాస్టిక్‌‌ షీట్లను తొలగించిన తర్వాత కూడా చిరిగిన ముక్కలు పొలంలోనే చెల్లాచెదురుగా పడిపోయేవి. వాటి వల్ల నేల నిస్సారంగా మారుతుంది.

అందుకే ప్రతి సంవత్సరం కూలీలను పెట్టి మరీ ఆ కవర్లను తొలగించేవాళ్లు. దానివల్ల ఖర్చు పెరిగింది. మూడు సంవత్సరాల క్రితం ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలా?.. అని ఆలోచిస్తున్నప్పుడే రాకేష్‌‌కు గ్రోఇట్‌‌ తీసుకొచ్చిన ‘నాన్ వోవెన్ మల్చింగ్ క్రాప్ కవర్‌‌’ గురించి తెలిసింది. అప్పటినుంచి రాకేష్‌‌ దాన్నే వాడుతున్నాడు. “ఈ నాన్ వోవెన్ కవర్ చాలా నాణ్యమైనది. పర్యావరణ అనుకూలమైనది. ఒకవేళ కవర్ చిరిగినా నేలకు ఎలాంటి ముప్పు ఉండదు. దీనివల్ల మాకు కూలీల ఖర్చు చాలావరకు ఆదా అవుతోంది. గతంలో ఒక్కో కూలీకి రోజుకు రూ. 250 ఇచ్చేవాళ్లం” అని చెప్పాడు రాకేష్​. 

©️ VIL Media Pvt Ltd.