
- జూన్1 వరకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్‌రెడ్డి
- ఫిట్మెంట్కూ గ్రీన్సిగ్నల్ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు
- ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ భేటీ
- తక్షణమే పీఆర్సీ నివేదిక తెప్పించుకుంటానని హామీ
- సీఎం సానుకూల ప్రకటనతో మే 5న ఉద్యమ కార్యాచరణ రద్దు
- మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: సీఎం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్కోసం వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని, తక్షణమే పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటిస్తామని, జూన్ 1 కల్లా హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపేలా సీఎం ప్రకటన చేయడంతో మే 5న ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు రద్దు చేసుకున్నాయి. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం సమావేశమై, సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం నాలుగు ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఉద్యోగ విరమణ చేసిన వారి బెనిఫిట్స్ కోసం రాబోయే వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామన్నారు. పీఆర్సీపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని, రిపోర్టు అందిన వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల చిరకాల స్వప్నమైన క్యాష్‌లెస్ హెల్త్ కార్డులను వచ్చే జూన్ 1కల్లా అందజేస్తామన్నారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 5న తలపెట్టిన నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.
ఉద్యోగులే ప్రభుత్వ వారధులు
ఉద్యోగుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం సక్సెస్ కాలేదని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అసలైన వారధులు ఉద్యోగులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రతీ నెల ఒకటో తారీఖునే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జీతాల కోసం నెలంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, దానిని తమ ప్రభుత్వం చక్కదిద్దిందని వివరించారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునే వాతావరణం కల్పించామని, బదిలీల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా పకడ్బందీగా వ్యవహరించామని చెప్పారు. ప్రధానంగా ఎంతో కాలంగా వివాదాల్లో చిక్కుకున్న టీచర్ల బదిలీలను ఎక్కడా చిన్న ఫిర్యాదు కూడా రాకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని సీఎం వెల్లడించారు.
ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామని, అందులో భాగంగానే వైద్య విధాన పరిషత్ పరిధిలోని 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టి యువతకు భరోసా ఇచ్చామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కేటాయించే రూ.6 వేల కోట్లను ఏ ప్రాధాన్యత ప్రకారం ఖర్చు చేయాలనేది కూడా ఉద్యోగ సంఘాల నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం పూర్తి సానుకూలతతో ఉందని, జూన్ 1 లోగా పంపిణీ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.
ఇది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి రెండు నెలలకోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్.. గుర్తింపు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం కొద్ది కాలంలోనే పరిష్కరించిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏమీ లేకపోయినా, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. రాష్ట్ర ఖజానాపై భారం ఉన్నప్పటికీ, ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సీఎంకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
సీఎం హామీలపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ నెల 5న నిర్వహించాలనుకున్న అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలను విరమిస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమకు ఇచ్చిన హామీ ప్రకారం మరుసటి రోజే సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడంపై జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డితో పాటు ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల వంటి కీలక డిమాండ్లపై సీఎం స్పష్టత ఇవ్వడం సంతోషకరమని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్ పేర్కొన్నారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకున్నదన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు ఏలూరి శ్రీనివాస రావు, జి. శ్రీనివాస్ రెడ్డి, పి. దామోదర్ రెడ్డి, జి. సదానందం గౌడ్, వి. రవీందర్ రెడ్డి, వి. రాజశేఖర్, కె. రామకృష్ణ, ఎస్. రాములు వొద్నల రాజశేఖర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎంకు, ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.