
జగిత్యాల టౌన్/కోరుట్ల, వెలుగు: ధర్మపురిలో వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఇప్పటికే ప్రభుత్వం రూ.115కోట్లు విడుదల చేసిందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘ప్రజా పాలన–- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రతి గ్రామానికి చేరుకుని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. టెన్త్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించారు. కోరుట్లలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత ఆధ్వర్యంలో 99 రోజుల కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, వెలుగు: అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా ముందుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణంలోని బందంపల్లిలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విప్ పాల్గొని మాట్లాడారు. ఈనెల 6న పెద్దపల్లిలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గంగాధర, వెలుగు: పేదల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దానిలో భాగంగా శాఖల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ కలెక్టర్ చిత్ర మిశ్రా అన్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లిలో చొప్పదండి నియోజకవర్గస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల పాదాలు
కడుగుతానన్నారు.
కరీంనగర్ అభివృద్ధే ప్రధాన ధ్యేయం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. సమావేశానికి కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి మేయర్, సుడా చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలకు ఆర్ఫన్ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పాల్గొన్నారు.