
చెన్నై: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. లీగ్ దశలోనే హార్ధిక్ పాండ్య సేన ఇంటిబాట పట్టింది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో చెన్నై చేతిలో ఓటమి పాలుకావడంతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది.హోంగ్రౌండ్ చెపాక్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన చెన్నై 8 వికెట్ల తేడాతో ముంబైను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67), కార్తీక్ శర్మ (54) హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా.. బౌలింగ్‌లో అన్షుల్ కాంబోజ్ మూడు వికెట్లు పడగొట్టడంతో చెన్నై టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ధీర్ (57), రికెల్టన్ (37) రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ఓవర్టన్, రామకృష్ణ చెరో వికెట్ సాధించారు. ముంబై నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.1 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.
కట్టడి చేసిన చెన్నై బౌలర్స్
ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైని చెన్నై బౌలర్స్ కట్టడి చేశారు. ఇన్ఫామ్ బ్యాటర్ విల్ జాక్స్ (1)ను ఫస్ట్ ఓవర్లోనే ఔట్ చేసి అన్షుల్ కాంబోజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. దీంతో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన నమన్ధీర్తో కలిసి ఓపెనర్ రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతోన్న రికెల్టన్ను నూర్ అహ్మద్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో రెండో వికెట్‌కు 58 పరుగుల పార్ట్ నర్ షిప్ ముగిసింది.
ఈ దశలో జతకట్టిన నమన్ ధీర్, సూర్య స్కోర్ బోర్డును పరిగెత్తించారు. మంచి టచ్‌లో కనిపించిన వేగంగా ఆడే క్రమంలో సూర్య కుమార్ యాదవ్ (21) వికెట్ చేజార్చుకున్నాడు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ (5) మరోసారి విఫలమయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా నమన్ధీర్ (57) హాఫ్ సెంచరీతో ముంబైను ఆదుకున్నాడు. కెప్టెన్ పాండ్యా వేగంగా ఆడలేకపోయాడు. 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ముంబై తక్కువ స్కోర్ కే పరిమితమైంది.
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన గైక్వాడ్, కార్తీక్
160 పరుగుల మోస్తారు లక్ష్యంతో చేధనకు దిగిన చెన్నైకు సరైన ఆరంభం లభించలేదు. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (11) నిరాశపర్చాడు. పవర్ ప్లేలో యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ 12 బంతుల్లో 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ దశలో జతకట్టిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67), యంగ్ హిట్టర్ కార్తీక్ శర్మ (54) హాఫ్ సెంచరీలతో రాణించి చెన్నైకు విజయాన్ని అందించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ చెరో వికెట్ తీశారు.
ముంబై ఇంటికి..!
ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన ముంబై కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి, ఏడింట్లో ఓటమి పాలైంది. తర్వాత ఆడబోయే ఐదు మ్యాచులకు ఐదు గెలిసిన ముంబై ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోదు. టోర్నీ ఫార్మాట్ ప్రకారం పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ఫ్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. ముంబై తర్వాత ఆడబోయే ఐదు మ్యాచులు గెలిచిన పాయింట్ల పట్టిలోకి టాప్ 4కు చేరుకోదు.