
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , త్రిషల కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం’కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). ఈ యాక్షన్ మూవీ విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వెండితెరపై ఈ జోడీని చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రమోషన్ల విషయంలో త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
అసలేం జరిగింది?
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరభద్రుడు’ మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు సూర్య హాజరైనప్పటికీ, హీరోయిన్ త్రిష కనిపించలేదు. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విమర్శ మొదటి నుంచీ ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు మొదలుపెట్టారు. రెమ్యూనరేషన్ తీసుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ, ప్రమోషన్లలో ఎందుకు ఉండదు?” అంటూ త్రిషను ఉద్దేశించి ట్రోలింగ్ చేశారు.
త్రిష షాకింగ్ సెటైర్లు..
లేటెస్ట్ గా మూవీ మేకర్స్ ‘ప్రీతి’ అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్న త్రిష ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు. దీనిపై ఓ అభిమాని ప్రశంసలు కురిపిస్తూ.. సినిమాలో త్రిష ఉందన్న విషయమే మర్చిపోయాను, ఆమె చాలా యంగ్‌గా కనిపిస్తోంది అని ట్వీట్ చేశాడు. దీనికి త్రిష స్పందిస్తూ.. ధన్యవాదాలు.. నేనూ (ఈ సినిమాలో ఉన్నాననే విషయం) మర్చిపోయాను. ఇప్పటికైనా వారు గుర్తు చేసినందుకు సంతోషం అని చిత్ర బృందంపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
మరో సూర్య అభిమాని ఆమె గైర్హాజరును ప్రశ్నించగా.. నా ఇన్విటేషన్ మెయిల్‌లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే అంటూ తనకు ఆహ్వానమే అందలేదని కుండబద్దలు కొట్టింది. ఈ కామెంట్లతో త్రిషను కావాలనే పక్కన పెట్టారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
మండిపడుతున్న ఫ్యాన్స్..
త్రిష లాంటి స్టార్ హీరోయిన్‌ను, అందులోనూ పోస్టర్ల మీద ఆమె పేరు వాడుకుంటూ వేడుకకు ఆహ్వానించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సీనియర్ నటిని ఇలా అవమానిస్తారా? అంటూ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై హీరో సూర్య జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Thank you ☺️ Even I forgot.Good to know they set a reminder now atleast😅 https://t.co/vAgpPJiJJ9
— Trish (@trishtrashers) May 1, 2026