
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణ పనులపై బుధవారం ఉదయం కుందన్ బాగ్లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు.
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు గాను ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్కు బాధ్యత అప్పగించామని ఆయన తెలిపారు. వారు నాలుగు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ముందుకు వచ్చిన నాలుగు ప్రతిపాదనలపై లోతుగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
ప్రతీ ప్రతిపాదనకు అయ్యే ఖర్చు.. అనుకూల, ప్రతికూల పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు (బుధ వారం) సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరగనున్న ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆ నాలుగు ప్రతిపాదనలపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.