Reading Time: 2 minutes

అనంతగిరి.. పర్యాటక సిరి!..80 హెక్టార్లలో రూ.2.50 కోట్లతో ఎకో అర్బన్ పార్క్ 

Caption of Image.
  • టూరిస్టులను ఆకర్షించేలా కాటేజీలు, ట్రెక్కింగ్​పాత్​
  • అడవిలో బుష్ బ్రేక్ ఫాస్ట్.. పక్షుల వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు
  • నేడు స్పీకర్​ గడ్డం ప్రసాద్​ చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  వీకెండ్ వచ్చిందంటే చాలు..సిటీ జనం  ప్రశాంతత కోసం అనంతగిరి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆ ప్లేస్ పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా అటవీశాఖ సరికొత్త హంగులతో  ‘ఎకో అర్బన్ పార్కు’ను రెడీ చేసింది. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో సుమారు 80 హెక్టార్ల విస్తీర్ణంలో  రూ.2.50 కోట్లతో ఈ పార్కును తీర్చిదిద్దారు. ఈ పార్కును సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోపాటు పీసీసీ సువర్ణ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇందులో టూరిస్టుల కోసం ఎంట్రన్స్​ గేట్​తోపాటు ట్రెక్కింగ్​పాత్, సావనీర్ షాపు, కొండల్లో, గ్రాస్​ల్యాండ్​ఏరియాలో పెద్ద గజబోలు, అర్బన్​ పార్కులో రెండు గజబోలు, సముద్ర నీటిమట్టానికి 700 మీటర్ల ఎత్తున పెద్ద వాచ్​టవర్ ఏర్పాటు చేశారు. తూర్పు వైపున మరో వాచ్ టవర్​ నిర్మించారు. వీటి ద్వారా అనంతగిరి ఫారెస్ట్​ వ్యూను చూడొచ్చు. అంతేకాదు, ఇది మూసీ జన్మస్థలం కావడంతో సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ పార్కు ఏర్పాటుతో స్థానికంగా ఉన్న దాదాపు 20 నుంచి 40 కుటుంబాలకు ఉపాధి కలిగిందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. 

పర్యాటకులకు బుష్​ బ్రేక్​ఫాస్ట్​.. 

పర్యాటకుల వసతి కోసం ఫారెస్ట్​కార్పొరేషన్​ డెవలప్​మెంట్​ఆధ్వర్యంలో కాటేజీలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం నాలుగు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. సందర్శకుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని కాటేజీలు నిర్మించేలా ప్లాన్​ చేస్తున్నారు. పర్యాటకుల కోసం బుష్​ బ్రేక్​ ఫాస్ట్​, బార్డ్ వాచ్​సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. దీని కోసం ఆన్​లైన్ తోపాటు నేరుగా కాటేజీల దగ్గరైనా టికెట్ బుక్​చేసుకోవచ్చు. కాటేజీల నిర్వహణ బాధ్యతలను ఎఫ్​డీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది.

ఒకరోజు ఒక వ్యక్తికి  రూ.3,800గా  నిర్ణయించారు. ఇందులోనే బ్రేక్​ఫాస్ట్, భోజనంతోపాటు వసతి కల్పిస్తున్నారు. ఇద్దరికి రూ.7,600 చొప్పున ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. అయితే, హైదరాబాద్​ నగరానికి సమీపంలో ఉండటంతో వీకెండ్స్​లో ఎక్కువ మంది వస్తారని, వారికి ఆహ్లాదం అందించేలా వసతులు కల్పిస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొన్నారు. 

మెరుగైన సౌకర్యాలు కల్పిస్తం: పీసీసీఎఫ్​ సువర్ణ

అనంతగిరి కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పర్యాటకుల కోసం ఆకర్షణీయంగా అనంతగిరి ఎకో పార్కు డెవలప్​ చేశాం. పర్యాటకులు స్టే చేసేలా సదుపాయాలు కల్పించాం. హైదరబాద్​కు సమీపంలో ఉండటంతో ఒకరోజులోనే పార్కు సందర్శనకు వెళ్లి ఈజీ తిరిగి రావొచ్చు. ఈ పార్కుకు సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వారి కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. 
 

©️ VIL Media Pvt Ltd.