
- ఆగస్టు 12న 15,835 మెగావాట్ల డిమాండ్
- గతేడాది ఇదే రోజు కేవలం 10,787 మెగావాట్లు మాత్రమే!
- ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వానలు తగ్గడం, ఎండలు పెరగడం, వరి సాగే కారణమంటున్న ఎక్స్ పర్ట్స్
- పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న సీఎండీలు
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పీక్స్‌కు చేరింది. పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు కరెంట్ మోటర్లపై ఎక్కువగా ఆధారపడ్తుండడం, ఉక్కపోతతో ఇండ్లలో కూలర్లు, ఏసీల వాడకం పెరగడంతో కొద్దిరోజులుగా కరెంట్ డిమాండ్ గత రికార్డులను తిరగరాస్తున్నది. వేసవికి దీటుగా ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్తంగా 15,835 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది ఇదే రోజు కేవలం 10,787 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉన్నది. ఏడాది వ్యవధిలో ఏకంగా 5,048 మెగావాట్ల అధిక వాడకం నమోదుకావడం సరికొత్త రికార్డుగా విద్యుత్ ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్..
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. ఎండల వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో గృహ విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఉక్కపోత వల్ల ఎండకాలం మాదిరిగానే ఏసీలు, కూలర్లు నడుస్తున్నాయి. పారిశ్రామిక, ఐటీ రంగాల్లోనూ విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతోంది. దీనికితోడు వర్షాలు లేక, ప్రాజెక్టుల నుంచి కాలువ నీరు రాక రైతులంతా బోర్లు, బావులపై ఆధారపడ్తున్నారు.
ఎల్‌నినో పరిస్థితుల్లో వరి సాగుచేయవద్దని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ముందు నుంచీ చెప్తున్నా వేలాది రైతులు పెడచెవిని పెట్టారు. ఎప్పట్లాగే వరి సాగు చేయడంతో ఇప్పుడు పంట కాపాడుకునేందుకు బోర్లు, బావుల్లో నీళ్లున్నంత సేపు కరెంట్ మోటార్లను నడిపిస్తున్నారు. దీంతో అగ్రికల్చరల్ కరెంట్ వినియోగం అంచనాలను మించిపోతున్నది.
ఆగస్టు నెలలో భారీగా పెరిగిన డిమాండ్..
ఆగస్టు నెల ప్రారంభం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్తంగా 15,835 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా, గతేడాది ఇదే రోజు కేవలం 10,787 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉంది. ఏడాది వ్యవధిలో ఏకంగా 5,048 మెగావాట్ల అధిక డిమాండ్ నమోదైంది.
దక్షిణ డిస్కమ్ పరిధిలో 3,623 మెగావాట్లు, ఉత్తర డిస్కమ్ పరిధిలో 1,421 మెగావాట్లు ఎక్కువ డిమాండ్ రికార్డు కావడం గమనార్హం. విద్యుత్ వినియోగానికి వచ్చే సరికి గతేడాది ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్తంగా 208.07 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ సారి 283.26 మిలియన్ యూనిట్లకు చేరుకున్నది.
ఒక్క సదరన్ డిస్కమ్ పరిధిలోనే 60.18 మిలియన్ యూనిట్ల అదనపు కరెంట్ వినియోగం నమోదైంది. కోర్ అర్బన్ ఏరియా(క్యూర్) పరిధిలో ఈ ఏడాది ఆగస్టు 12న 3,920 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదుకాగా, గత ఏడాది ఇదే రోజున 3,310 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉన్నది. క్యూర్ పరిధిలో విద్యుత్ వినియోగం 81.17 మిలియన్ యూనిట్లకు చేరగా, గత ఏడాది 65.49 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 15.68 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగినట్లు దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్ వి.పాటిల్ ప్రకటించారు.
ఉత్తర డిస్కమ్‌లో ఆగస్టు 3న రికార్డు..
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ డిస్కమ్ పరిధిలో ఆగస్టు 3న అత్యధిక విద్యుత్ డిమాండ్, వినియోగం నమోదైంది. గతేడాది ఆగస్టు 26న 5,655 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ఈ సారి ఆగస్టు 3న ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఆ రోజు 6,198 మెగావాట్లు నమోదైనట్లు డిస్కమ్ సీఎండీ వరుణ్ రెడ్డి ప్రకటించారు.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అదనపు లోడ్‌ను భరించేలా సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లను బలోపేతం చేయడంతో పాటు అత్యవసర బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచుతూ, కీలక ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపడ్తున్నామని ఇరువురు సీఎండీలు చెప్తున్నారు.