Reading Time: 2 minutes
Moulvi Muhammad Baqir Journalist Of 1857 Revolt

Moulvi Muhammad Baqir: 1857… దేశం మొత్తం మంటల్లో ఉంది. ఎక్కడ చూసినా తిరుగుబాటు. ఎక్కడ చూసినా తుపాకుల శబ్దం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చేయాలన్న కోపంతో సైనికులు ముందుకు కదులుతున్నారు. కానీ ఢిల్లీలో… ఒక మనిషి చేతిలో తుపాకీ లేదు. కత్తి లేదు. సైన్యం లేదు. అతని చేతిలో ఉన్నది ఒక్కటే… కలం. ఆ కలం పేరు మౌల్వీ మహమ్మద్ బాఖిర్. అతను ఒక జర్నలిస్ట్. ఒక పత్రికను నడిపే మనిషి. ఆ పత్రిక పేరు ఢిల్లీ ఉర్దూ అఖ్బార్.

1857 మేలో ఢిల్లీ తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత, ఆ పత్రికలో వచ్చిన వార్తలు, సంపాదకీయాలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల మనసుల్లో అగ్గి రాజేశాయి. తిరుగుబాటు సమయంలో ఆ పత్రిక ప్రచురించిన సంచికలు ఇప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలాయి.

ఒక్కసారి ఆ కాలాన్ని ఊహించండి. ఒకవైపు బ్రిటిష్ సైన్యం..మరోవైపు తిరుగుబాటు చేస్తున్న సిపాయిలు. మధ్యలో… ఒక చిన్న ప్రెస్. అక్కడ అక్షరాలను ముద్రిస్తున్నారు. ఒక్కో అక్షరం… ఒక్కో వాక్యం… ఒక్కో పేజీ… బ్రిటిష్ పాలన మీద ప్రశ్నగా మారుతున్నాయి. ఆ రోజుల్లో వార్త రాయడం అంటే ఇప్పటిలా ఒక కథను కంప్యూటర్లో టైప్ చేసి పంపడం కాదు. ఆ కాలంలో ఒక పత్రిక ప్రజల చేతుల్లోకి వెళ్లడం అంటే… ఒక ఆలోచన ప్రజల మధ్యకు వెళ్లడం. బాఖిర్ ఆ శక్తిని అర్థం చేసుకున్నాడు. అందుకే అతని పత్రిక కేవలం వార్తలు చెప్పే కాగితం కాలేదు. అది తిరుగుబాటు కాలంలో ఒక గొంతుకగా మారింది.

ముఖ్యంగా హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చిన రచనలు కూడా అందులో వచ్చాయి. బ్రిటిష్ పాలనను ఎదుర్కోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన పత్రిక ప్రజలను ఉద్దేశించి రాసింది. అది బ్రిటిష్ అధికారులకు కనిపించకుండా ఉండలేదు.

ఎందుకంటే… ఒక తుపాకీ ఒక్క మనిషిని గాయపరచగలదు. ఒక కలం… వేల మందిని ఆలోచించేలా చేయగలదు. అందుకే బ్రిటిష్ పాలకులకు బాఖిర్ ప్రమాదకరంగా కనిపించాడు. 1857 సెప్టెంబర్‌లో బ్రిటిష్ సైన్యం ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ వెంటన ఢిల్లీలో భయం నిండిపోయింది. అలాంటి సమయంలో… బాఖిర్ అరెస్టయ్యాడు. అతని చేతిలో ఉన్న కలం ఆగిపోయింది. కానీ… అతను రాసిన మాటలు అప్పటికే పేజీలను దాటి ప్రజల జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాయి. 1857 సెప్టెంబర్‌లోనే బ్రిటిష్ చేతుల్లో అతని ప్రాణం పోయింది. అతని మరణం ఎలా జరిగిందన్న విషయంలో చారిత్రక ఆధారాల్లో వివరాల తేడాలు కనిపిస్తాయి.

కొన్ని ఆధారాలు ఉరితీశారని చెబుతుండగా, మరికొన్ని విచారణ లేకుండా కాల్చి చంపారని నమోదు చేశాయి. కానీ ఆయన మరణం వెనుక ఉన్న అసలు కథ… ఒక జర్నలిస్ట్ కథ. ఒక పత్రిక కథ. ఒక కలం కథ. మనకు స్వాతంత్ర్యం అంటే ఈరోజు ఒక జెండా కనిపిస్తుంది. ఒక సెల్యూట్ కనిపిస్తుంది. ఒక జాతీయ గీతం వినిపిస్తుంది. కానీ ఆ స్వాతంత్ర్యం వెనుక… ఎంతమంది తమ గొంతులు కోల్పోయారో… ఎంతమంది తమ జీవితాలు కోల్పోయారో… ఎంతమంది తమ చేతుల్లో ఉన్న చివరి ఆయుధాన్ని కూడా దేశం కోసం వదిలారో… అది చరిత్రలోని ప్రతి పేజీ చెబుతుంది.

మౌల్వీ మహమ్మద్ బాఖిర్ చేతిలో చివరి వరకు ఉన్నది ఆయన నమ్ముకున్న కలం. ఆ కలం ఒక సామ్రాజ్యాన్ని కూల్చలేదు కానీ… సామ్రాజ్యాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజల్లో నింపింది. అందుకే 1857 కథలో తుపాకుల శబ్దం మాత్రమే వినిపించకూడదు. ఒక ప్రెస్‌లో మెల్లగా ముద్రించిన అక్షరాల శబ్దం కూడా వినిపించాలి. ఎందుకంటే కొన్ని విప్లవాలు యుద్ధభూమిలో మొదలవుతాయి. మరికొన్ని… ఒక తెల్ల కాగితంపై పడిన నల్ల సిరా చుక్కతో మొదలవుతాయి. మౌల్వీ మహమ్మద్ బాఖిర్ కథ… అలాంటి ఒక విప్లవ కథేనండి. కలం కత్తికంటే పదునుగా మారినప్పుడు పుట్టిన విప్లవ కథ అది.