Reading Time: 2 minutes

గూడెం దాటి.. పట్నం షికారు!..గిరిపుత్రుల నగర విహారానికి ప్రభుత్వం ఏర్పాట్లు

Caption of Image.
  • ఆదిలాబాద్‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌కు విజ్ఞానయాత్ర
  • చారిత్రక, పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా ‘ట్రైబల్ టూరిజం ప్రాజెక్టుకు’ కసరత్తు
  • తొలి విడతలో 200 మందికి చాన్స్​

హైదరాబాద్, వెలుగు:  అడవిలో పుట్టి, అడవిలోనే జీవిస్తున్న గిరిపుత్రులకు బాహ్య ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివాసీ, గిరిజనులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి వారికి లోకజ్ఞానాన్ని, చారిత్రక కట్టడాల విశిష్టతను వివరించేలా ట్రైబల్  టూరిజం ప్రాజెక్టుకు కసరత్తు చేస్తోంది.

 గిరిజన పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యాటకులను అడవికి తీసుకెళ్లడమే కాకుండా అడవి బిడ్డలను నగరానికి తీసుకొచ్చి ఇక్కడి చారిత్రక సంపదను చూపేలా  ‘విజ్ఞానయాత్ర’ కు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌  జిల్లాను పైలట్  ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల గూడేలు, గ్రామాల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులను ఎంపికచేసి వారిని హైదరాబాద్‌‌‌‌కు తీసుకురానున్నారు.

.మొదటి విడతలో సుమారు 200 మందికి ఈ అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పర్యాటక శాఖ ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. వారికి రవాణాతోపాటు భోజనం, వసతి సౌకర్యం కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. 

చారిత్రక కట్టడాలు వీక్షించేందుకు.. 

నగర సందర్శనకు వచ్చే ఆదివాసీ, గిరిజన బృందానికి ఇక్కడి చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, అభివృద్ధిని కళ్లారా చూసేలా రూట్ మ్యాప్  రెడీ చేశారు. కుతుబ్ షాహీల వైభవానికి దర్పణం పట్టే గోల్కొండ కోట, సాగర తీరాన కొలువుదీరిన బుద్ధ విగ్రహం, హుస్సేన్ సాగర్ లో విహారంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పంచే లుంబినీ పార్కు, అక్కడి లేజర్ షో వీటితో పాటు బిర్లా మందిర్, మ్యూజియం వంటి ప్రాంతాలను చూపించి చరిత్రపై అవగాహన కల్పించనున్నారు.

వినోదం కోసమే కాకుండా నగరం ఎలా ఉంటుంది? ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తోంది? వంటి అంశాలను వీరికి ప్రత్యక్షంగా వివరిస్తారు. సాధారణంగా విద్యార్థులకే పరిమితమయ్యే ఇలాంటి పర్యటనలను ఇప్పుడు సామాన్య గిరిజనులకు చూపించనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఈ బృందం ఆదిలాబాద్  నుంచి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌‌‌‌కు పయనమవ్వనుంది. ఈ యాత్ర విజయవంతమైతే.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల గిరిజనులకూ ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పైసా ఖర్చు లేకుండా టూర్: మంత్రి జూపల్లి

ఆదివాసీ, గిరిజనుల కోసం హైదరాబాద్‌‌‌‌కు ఉచితంగా మెట్రోపాలిటన్ ఎక్స్‌‌‌‌పోజర్ టూర్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇది వరకే ప్రకటించారు. నగర జీవితం, హైదరాబాద్‌‌‌‌లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి గురించి ఆదివాసీ, గిరిజనులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

మారుమూల గూడేల్లోని గిరిజన తెగలకు, ఆధునిక ప్రపంచానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని జూపల్లి పేర్కొన్నారు. ఈ ఎక్స్‌‌‌‌పోజర్ టూర్ కోసం ఆదివాసీలను వారి గ్రామాల నుంచి హైదరాబాద్‌‌‌‌కు ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి ఖర్చు లేకుండా తీసుకెళ్తున్నామని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.