Reading Time: < 1 minute
Sai Krishna Custodial Death Case Ap High Court Stays Private Complaint

Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి విజయవాడ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్‌పై జరుగుతున్న తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అదే అంశంపై ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా సమాంతరంగా చర్యలు చేపట్టడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్ జోన్ ఏసీపీని నిందితులుగా చేర్చాలంటూ ఎంపీ గురుమూర్తి విజయవాడ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. దీనిపై ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఈ ప్రక్రియను సౌత్ జోన్ ఏసీపీ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా సమాంతర చర్యలు చేపట్టడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.

దీంతో ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్‌పై విజయవాడ కోర్టులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీ వరకు ఈ స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారు ఎంపీ మద్దెల గురుమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.