Reading Time: 3 minutes

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 17న సనత్ నగర్ టిమ్స్ ఓపెనింగ్

Caption of Image.
  • రూ. 1,126 కోట్ల వ్యయం..1,000 బెడ్లతో హాస్పిటల్
  • 53.3 ఎకరాల క్యాంపస్.. 22.67 ఎకరాల్లో నిర్మాణం
  • రాష్ట్రంలోనే తొలి స్టాండ్‌‌‌‌‌‌‌‌ అలోన్ స్టేట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు
  • విజయవంతంగా కొనసాగుతున్న ఓపీ సేవల ట్రయల్ రన్
  • 24 గంటలూ పనిచేసే 
  • 30 బెడ్ల డయాలసిస్ సేవలు.. 300 ఐసీయూ బెడ్లు
  • ప్రారంభించనున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్(డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 

ఈ ఏడాది మే 1 నుంచే ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఔట్​ పేషెంట్​ (ఓపీ) సేవలతో ట్రయల్ రన్ విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్ రన్‌‌‌‌‌‌‌‌లో రోజూ  సగటున250కిపైగా ఓపీ నమోదువుతున్నది. ప్రారంభం తర్వాత ఇన్‌‌‌‌‌‌‌‌పేషెంట్‌‌‌‌‌‌‌‌ సేవలు అందుబాటులోకి వస్తే.. పేషంట్ల సంఖ్య మరింత పెరగనున్నది. అత్యున్నత ప్రమాణాలు, అధునాత సౌకర్యాలతో నిర్మించిన ఈ సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌తో హైదరాబాద్ సిటీతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించనున్నాయి. 

రూ. 1,126 కోట్లతో 22 ఎకరాల్లో నిర్మాణం

టిమ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను రూ. 1,126 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఈ హాస్పిటల్ ప్రాంగణం మొత్తం 53.3 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉండగా, టిమ్స్ ఆవరణ 22.67 ఎకరాల్లో ఉంది. హాస్పిటల్ మొత్తం1,082 బెడ్లు ఉన్నాయి. వైద్య సేవల కోసం ఇందులో మొత్తం 37 డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉంటాయి. మొదటి విడతలో 28 డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ, 11 బ్రాడ్ స్పెషాలిటీ, 6 డయాగ్నోస్టిక్ అండ్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉన్నాయి. మిగిలిన 9 డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను రెండో విడతలో ప్రారంభించనున్నారు. 16 మేజర్ మాడ్యులర్ థియేటర్లు, 

ఆధునిక ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు.. 

హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 16 మేజర్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను నిర్మించారు. ఏ-–బ్లాక్ లో ఎమర్జెన్సీ చికిత్సల కోసం 4 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, 11 ఎలెక్టివ్ మాడ్యులర్ ఓటీలను ఏర్పాటు చేశారు. బీ –-బ్లాక్‌‌‌‌‌‌‌‌లో క్యాథ్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు అనుసంధానంగా కార్డియో థొరాసిక్ ఓటీ రెండో దశలో అందుబాటులోకి రానుంది.  గుండె సంబంధిత టెస్టుల కోసం రెండు క్యాథ్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ, సీటీ స్కాన్ సౌకర్యాలతో పాటు 628 రకాల మందులను అందించే ఇన్‌‌‌‌‌‌‌‌హౌస్ ఫార్మసీ ఉంటుంది. క్యాన్సర్ చికిత్స కోసం ‘లీనియర్ యాక్సిలరేటర్’ (లినాక్), 2D బ్రాకీథెరపీ కలిగిన న్యూక్లియర్ మెడిసిన్ సెంటర్‌‌‌‌‌‌‌‌ రెండో దశలో అందుబాటులోకి రానున్నాయి.

పేషెంట్‌‌‌‌‌‌‌‌ అటెండెంట్ల కోసం ధర్మశాల.. 

పేషెంట్‌‌‌‌‌‌‌‌ అటెండెంట్ల కోసం ప్రాంగణంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్, ధర్మశాల నిర్మించారు. ఈ ధర్మశాలలో 196 జనరల్ బెడ్లు, 30 పెయిడ్ బెడ్లు అందుబాటులో ఉంటాయి. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో మందులు, శాంపిల్స్ వేగంగా పంపడానికి న్యూమాటిక్ షూట్ సిస్టమ్ ఉంది. పేషెంట్ల సౌకర్యం కోసం నర్స్ కాల్ సిస్టమ్, ఓపీ వద్ద అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ క్యూ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలూ అందుబాటులో ఉండేలా 3 ఆంబులెన్సులు ఉన్నాయి. ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం 2,360 పోస్టులను మంజూరు చేసింది. ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు మెంటర్ ఇన్స్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్న నిమ్స్‌‌‌‌‌‌‌‌.. ఎమర్జెన్సీ సేవలు, డయాగ్నోస్టిక్స్, బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తున్నది.

4 ప్రధాన డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..

సనత్‌‌‌‌‌‌‌‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను 4 ప్రధాన డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌గా రూపుదిద్దారు.
కార్డియాక్ సైన్సెస్:  కార్డియాలజీ, హార్ట్ సర్జరీ, వాస్క్యులర్ సర్జరీ సేవలు లభిస్తాయి.
రీనల్ సైన్సెస్: కిడ్నీ కేర్, యూరాలజీ, నిరంతర డయాలసిస్ సేవలను అందిస్తుంది.
ట్రామా సైన్సెస్: న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ చికిత్సలు లభిస్తాయి.
ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంట్ సైన్సెస్: ఇది రాష్ట్రంలోనే తొలి స్టాండ్‌‌‌‌‌‌‌‌ అలోన్ ‘సెంటర్ ఫర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంట్ సైన్సెస్’గా నిలవనున్నది. లివర్, కిడ్నీలు, హార్ట్, లంగ్స్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కోసం నాలుగు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లను కేటాయించారు. ఇక్కడ చర్మం, ఎముక మజ్జ (బోన్ మ్యారో), కంటి చూపు (కార్నియా) మార్పిడి చికిత్సలను కూడా నిర్వహిస్తారు.

ఏ, బీ, సీ బ్లాక్‌‌‌‌‌‌‌‌లుగా సేవల వర్గీకరణ 

రోగుల వైద్య సేవలను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోని 3 ప్రధాన బ్లాక్‌‌‌‌‌‌‌‌లలో విభజించారు
ఏ-–బ్లాక్: ఎమర్జెన్సీ సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 
300 బెడ్ల ఐసీయూలు, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కోసం కేటాయించారు.
బీ –బ్లాక్: అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు, ఫార్మసీ, క్యాథ్ ల్యాబ్, 
కార్డియో థొరాసిక్ ఆపరేషన్ థియేటర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి.
సీ –-బ్లాక్: ఇన్‌‌‌‌‌‌‌‌పేషెంట్ రూమ్‌‌‌‌‌‌‌‌లు, వార్డులు, రేడియాలజీ సేవలు ఉంటాయి. ఇందులో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కోసం 100 బెడ్లు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే 30 బెడ్లతో నిరంతరం పనిచేసే డయాలసిస్ యూనిట్ ఉంది. ఎమర్జెన్సీ డయాలసిస్ కోసం ట్రయాజ్‌‌‌‌‌‌‌‌లో మరో రెండు బెడ్లు అందుబాటులో ఉంచారు.

రెండు దశల్లో పూర్తిస్థాయి వినియోగం

హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను రెండు దశల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. 
మొదటి దశ: 582 బెడ్లు, 15 ఆపరేషన్ థియేటర్లు పనిచేస్తాయి. ఇందులో 88 ఎమర్జెన్సీ బెడ్లు, 30 డయాలసిస్ బెడ్లు, 100 ఐసీయూ బెడ్లు, 100 జనరల్ బెడ్లు ఉంటాయి.
రెండో దశ: మరో 500 బెడ్లు అందుబాటులోకి వస్తాయి. ఇందులో విదేశీ పేషెంట్ల కోసం 100 మెడికల్ టూరిజం బెడ్లు, 100 పెయిడ్ రూమ్‌‌‌‌‌‌‌‌లు, ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు మరో 100 బెడ్లు, 200 జనరల్ వార్డు బెడ్లు ఉంటాయి.

©️ VIL Media Pvt Ltd.