
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో ఎరువుల అమ్మకాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ రైతులకు చుక్కలు చూపిస్తోంది. యాప్ లో యూరియా బుక్ చేయడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. అన్ని ఆప్షన్ లు సెలెక్ట్ చేసి బుక్ చేసేలోపు స్టాక్ నిల్ అని చూపిస్తోంది. దీంతో యూరియా దొరకని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటకు యూరియా వేసే సమయం ఇదీ..
ఈ వానాకాలం సీజన్ లో మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, సుమారు 35 వేల ఎకరాల్లో పత్తి పంట సాగయ్యింది. పంటల ఎదుగుదలకు యూరియా వేసే సమయం రాగా అది దొరక్క పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు ఫర్టిలైజర్ యాప్ లో యూరియా బుకింగ్ కోసం రైతులు తిప్పలు పడగా, ఇపుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్’ లో ఎరువుల బుకింగ్ మరింత కష్టతరంగా ఉంది.
ఆండ్రాయిడ్ ఫోన్ లో మాత్రమే ఈ యాప్ పనిచేస్తోంది. యూరియా, డీఏపీ, ఎంఓపీ వంటి ఎరువులు ఏవి కావాలన్నా తప్పనిసరిగాఈ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే. అందరి రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లు లేకపోవడంతో పాటు ఫార్మర్రిజిస్ట్రి చేసుకోకపోవడం, ఆధార్ కార్డుకు మొబైల్ లింక్ లేకపోవడం వంటి కారణాలతో వారికి ఎరువుల దొరకని పరిస్థితి ఉంది. చిన్న ఫోన్ మాత్రమే ఉన్న రైతులు ఎరువుల బుకింగ్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న రైతుల వద్దకు పరుగులు పెడుతున్నారు.
అయితే ఆ రైతులు వారికి అవసరమైన ఎరువుల కోసం యాప్ లో బుకింగ్ కోసం తంటాలు పడుతుండటంతో చిన్న రైతులకు సాయం చేయలేకపోతున్నారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ లేని రైతులు సొసైటీ సిబ్బంది వద్దకు, ఫర్టిలైజర్ షాప్ డీలర్ల వద్దకు వెళ్లి తమకు ఎరువులు బుక్ చేయాలని బతిమిలాడుతున్నారు. చిలప్ చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన రైతు బోయిన రాములు తన వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడంతో యూరియా బస్తాల కోసం కొల్చారం మండలం రంగంపేట సొసైటీ అటెండర్కాళ్ల మీద పడి వేడుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
గంటల తరబడి వెయిటింగ్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్)లకు యూరియా స్టాక్ వస్తుండగా యాప్ ఓపెన్ కావడానికి గంటల తరబడి వెయిట్చేయాల్సి వస్తోంది. తీరా యాప్ ఓపెన్ అయ్యాక క్షణాల్లో స్టాక్ అయిపోతోంది. రైతులు యాప్ ఓపెన్ చేసి అన్ని ఆప్షన్ లు ఓకే చేసి సొసైటీ సెలెక్ట్ చేసుకునే సరికి స్టాక్ నిల్ చూపిస్తోంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త యాప్ లో జిల్లాలో ఎక్కడైనా యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించడం వల్ల త్వరగా స్టాక్ అయిపోతోంది.
ఇదిలా ఉండగా తమ గ్రామంలో లేదా సమీపంలోని సొసైటీలో దొరుకుతుందో లేదో అని రైతులు దూర ప్రాంతాల్లోని సొసైటీలో యూరియా బుక్ చేస్తున్నారు. కొల్చారం, కౌడిపల్లి, పాపన్నపేట మండలాల రైతులు అల్లాదుర్గం, రేగోడ్, పెద్ద శంకరంపేట సొసైటీలో యూరియా బుక్ చేసుకుంటుండగా అక్కడికి వెళ్లి ఎరువుల బస్తాలు తెచ్చుకోవడానికి వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నాయి. 40 నుంచి 50 కిలో మీటర్ల దూరం వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వస్తుండటం వల్ల తమపై అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డెక్కి ఆందోళనలు..
కొత్త యాప్ వల్ల ఇబ్బందులు ఎదురవుతుండటం, యూరియా దొరక్క పోవడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం చేగుంట మండలం పోలంపల్లి వద్ద రైతులు రాస్తా రోకో చేయగా, గురువారం రామాయంపేట పట్టణంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇబ్బంది కరంగా ఉన్న కొత్త యాప్ ను రద్దు చేసి నేరుగా ఫర్టిలైజర్ షాప్ల్లో, సొసైటీల్లో ఎరువులు కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.