Reading Time: 2 minutes

బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తున్నారా..? హైదరాబాద్ కొంపల్లిలో ఏమైందో చూడండి !

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లిలో బిగ్ బాస్కెట్ వేర్ హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ రైడ్స్ చేశారు. ఈ వేర్ హౌస్‌లో పావురాల మలం, ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. అశుభ్రంగా కూరగాయలు నిల్వ, సేఫ్టీ లేకుండా హ్యాండ్లింగ్ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. చికెన్, ఫిష్ సాంపిల్స్ సేకరించి ల్యాబ్కి అధికారులు తరలించారు. 

చింతపండు ప్యాకెట్‌పై లేబుల్ టాంపరింగ్ చేసి ఎక్స్‌పైరీ డేట్ మార్చి రీలేబ్లింగ్ చేసినట్టు గుర్తించారు. పాడైన కూరగాయలను అధికారులు డిస్ కార్ట్ చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా తుప్పు పట్టిన ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో ఫుడ్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించి 22 వాహనాలను వాడుతున్నట్లు గుర్తించారు. కొంపల్లిలో బిగ్ బాస్కెట్ వేర్ హౌజ్ నిర్వహిస్తున్న రాజరాజేశ్వరి ఫుడ్ ప్రాసెసర్స్కి అధికారులు నోటీసులు ఇచ్చారు. 

ఇదిలా ఉండగా.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్ల ఆటకట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆహార కల్తీని మూలాలను పెకిలించి వేసేందుకు  ఈగల్‌‌‌‌ తరహా ‘స్పెషల్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌’ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక విభాగానికి సారథ్యం వహించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించేలా కసరత్తు చేస్తున్నది.

కేవలం నగరాలకే పరిమితం కాకుండా.. కల్తీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను పాతాళానికి తొక్కేలా మండలస్థాయి వరకు ఈ వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. కల్తీని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్న ప్రభుత్వం, కల్తీ నేరగాళ్లకు చుక్కలు చూపించేలా చట్టాల్లో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నది. కేవలం పీడీ యాక్ట్​లాంటివే కాకుండా జీవిత ఖైదులాంటి కఠిన శిక్షలు అమలు చేయాలని చూస్తున్నది. 

ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న చట్టంలో తీసుకురావాల్సిన మార్పులను పరిశీలించాలని ఉన్నతాధికారులను  సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు.  క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, కల్తీ మాఫియా వెన్నులో వణుకు పుట్టించడమే లక్ష్యంగా ఈ కొత్త వింగ్ రూపుదిద్దుకుంటున్నది. 

కేవలం అధికారుల పర్యవేక్షణే కాకుండా, గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీల్లో మహిళా సంఘాలను ‘ఫుడ్ వలంటీర్లు’గా భాగస్వామ్యం చేసి.. వారికి ప్రాథమిక పరీక్షా కిట్లను అందించే దానిపైనా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. గల్లీలోని కిరాణా షాపు నుంచి మల్టీ నేషనల్ బ్రాండ్ల వరకు ఎక్కడా రాజీ లేకుండా తనిఖీలు  చేస్తూ  కల్తీ నెట్‌‌‌‌వర్క్ ను తుడిచిపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.

©️ VIL Media Pvt Ltd.