
- ఏలేటి మహేశ్వర్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పార్లమెంటు ఆమోదించిన చట్టాలను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని, ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కనీస రాజ్యాంగ అవగాహన లేదని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 256 ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను అమలు చేయడం రాష్ట్రాల బాధ్యత అని ఏలేటి స్పష్టం చేశారు. కేంద్రం ఆదేశాలను ధిక్కరిస్తే ఆర్టికల్ 365 ప్రకారం రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనట్టు భావించాల్సి ఉంటుందన్నారు.
అటువంటి పరిస్థితుల్లో ఆర్టికల్ 356ను ప్రయోగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని, 2/3 వంతు మెజారిటీతో ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణ బిల్లులను అడ్డుకోవడం ఎవరితరం కాదని ఆయన హెచ్చరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్ పార్టీ ఏడోసారి అడ్డుకుందని ఏలేటి మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విషయం తెలిసి కూడా రేవంత్ రెడ్డి నటన చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రతిపాదించిన 50 శాతం దామాషా పద్ధతి వల్ల దక్షిణాదికి 195 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని, తెలంగాణ సీట్లు 26కు పెరుగుతాయని వివరించారు.