Reading Time: < 1 minute

సమ్మె విరమించిన ఆర్టిజన్లు…డిప్యూటీ సీఎం భట్టితో చర్చలు సఫలం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం గత 10 రోజులుగా ఆందోళన బాట పట్టిన విద్యుత్ ఆర్టిజన్లు శుక్రవారం సమ్మెను విరమించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఆర్టిజన్ల జేఏసీ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చర్చల అనంతరం జేఏసీ చైర్మన్ సతీశ్ రెడ్డి, కన్వీనర్ సాయిలు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున ఆర్టిజన్లంతా తక్షణమే విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. 

సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించిన డిప్యూటీ సీఎంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయిలో (పీక్ స్టేజ్) ఉందని, ఇలాంటి కీలక సమయంలో సమ్మెకు వెళ్లడం ప్రజలకు ఇబ్బందికరమని పేర్కొన్నారు. 

ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. విద్యుత్ సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.ఆర్టిజన్ల జేఏసీతో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ చర్చలు జరిపి, క్షేత్రస్థాయి సమస్యలపై నివేదిక సిద్ధం చేస్తారని తెలిపారు. ఈ చర్చల్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఆర్టిజన్ల కో-చైర్మన్లు చంద్రారెడ్డి, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్ ఠాకూర్, వైస్ ఛైర్మన్ సంతోష్, కోశాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.