Reading Time: < 1 minute

ఇబ్రహీంపట్నంలో టెన్షన్ టెన్షన్.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్లతో ఉద్రిక్తత

Caption of Image.
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల అరెస్ట్

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయంటూ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను నిరూపించాలని, దమ్ముంటే యాచారం మండలం మేడిపల్లిలో రైతుల వద్దకే రావాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్​తో శుక్రవారం ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మేడిపల్లికి తరలివచ్చేందుకు ప్రయత్నించాయి. 

అయితే, ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉండటంతో, ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా మేడిపల్లికి వెళ్లేందుకు సిద్ధమవడంతో ఉద్రిక్తత నెలకొంది.పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మేడిపల్లిలో ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదని ప్రకటించి, సభ కోసం వేసిన టెంట్లను తొలగించారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డిని బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. 

మేడిపల్లికి చేరుకున్న మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలను అరెస్ట్ చేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్​కు తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలను కడ్తాల్, మడుగుల స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం, యాచారంలో ఎమ్మెల్యే మల్​రెడ్డి దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశాయి. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు అవాస్తవమని, దమ్ముంటే నిరూపించాలని ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.