Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి: నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ కా వాలా..! నీళ్లు కావాలా..! అని అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని కోరుకుంటామని ఆయ న చెప్పారు. నదీ జలాలపై రాజకీయ ప్రయోజ నం పొందాలని ప్రభుత్వం భావించడం లేదని, రాజకీయాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ జల వివాదాల గురించి ఆయన ప్రస్తావించారు. పక్క రాష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదని ఆయన అన్నారు. న్యాయస్థానాల ముందు లేదా మరెవరి వద్దనో పంచాయితీ పెట్టుకునే కన్నా సమస్యను కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోందన్నారు. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం, సయోధ్య ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పక్క రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు

ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించరాదు

కృష్ణానదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించరాదని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన విజ్ఞప్తి చేశారు. జల వివాదాలపై శాశ్వత పరిష్కారం, రాష్ట్ర ప్రయోజనాలపై వివాదాలను కోరుకోవడం లేదని, సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని ఆయన కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్‌ఎల్‌బిసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల వల్ల పర్యావరణం, సీడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు కూడా రావడం లేదని, తద్వారా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని, పరస్పర సహకారం అవసరమని ఆయన సూచించారు. పోర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, ఆ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఎపి రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం

అలాగే, ఎపి రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యల సంపూర్ణ పరిష్కారం కోసం ముందుంటామన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తూ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని ఆయన వివరించారు. తెలంగాణ ప్రపంచంలో జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో పోటీ పడాలని సంకల్పించామని, అందులో భాగంగానే యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభిం చే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ వాటిల్లో పోటీ పడగలుగుతున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యా రంగంలోనూ సరికొత్త పాలసీని ప్రకటించబోతున్నాం

రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి పారిశ్రామిక, విద్యుత్, పర్యాటక, దేవాదాయ, వైద్య రంగాల్లో ప్రభుత్వం పాలసీలు తీసుకొచ్చిందని, విద్యా రంగంలోనూ సరికొత్త పాలసీని ప్రకటించబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి పారదర్శకమైన ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ వల్ల ఇక్కడి భూముల ధరలు పెరుగుతాయని అభివృద్ధికి అందరూ సహకరించాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అందరి సహకారం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. 1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్ల హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సుజెన్ మెడికేర్ సంస్థ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో సుజెన్ మెడికేర్ సంస్థ దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీకి సంబంధించి సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. సుజెన్ మెడికేర్ సంస్థ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందన్నారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన అత్యద్భుతమైన వాతావరణం మన రాష్ట్రంలో ఉందని ఆయన అన్నారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వం సైతం పాలసీలు రూపొందింస్తోదని ఆయన వెల్లడించారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని సిఎం చెప్పారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉన్నది మన దేశం వాళ్లేనని ఆయన అన్నారు. ప్రపంచమే హైదరాబాద్ వైపు చూసేలా ఫార్మా రంగం వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే అనివార్యంగా ప్రైవేట్ రంగాన్ని ప్రొత్సహించాల్సిన పరిస్థితులు వచ్చాయని సిఎం అన్నారు. సుజెన్ మెడికేర్ ఐవీ ఫ్లూయిడ్స్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి, శాసనమండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.