
కేంద్రం ప్రభుత్వం 543/545 పార్లమెంట్ ఎంపి స్థానాలను 816కు (పెరిగేవి 273), 4123 అసెంబ్లీ స్థానాలను 6185కు (పెరిగేవి 2062) పెంచి 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావాల్ ఇటీవల ప్రకటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాక ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి చట్టసభల సీట్ల పెంపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. 2023 సెప్టెంబర్‌లో ఆమోదం పొందిన మహిళ బిల్లు (నారీశక్తి వందన్ అదినియమ్-2023) ప్రకారం చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లను కూడా అమలు చేయాలని భావించడం శుభపరిణామం. ఎందుకంటే మొట్టమొదట 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీలో మహిళలకు 33% రిజర్వేషన్ ఆమోదం పొంది, 1996లో హెచ్‌డి దేవెగౌడ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని బిల్లు ఆమోదం పొందక, 1998, 1999, 2003 లో ఎన్‌డిఎ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి ఏకాభిప్రాయం లేక పెండింగ్‌లో ఉండి, 2010లో యుపిఎ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందక కునారిల్లి 2023 సెప్టెంబర్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదింపజేసి ఆచరణలోకి తేవడం ఆకాశంలో సగమన్న మహిళలకు, యావత్తు దేశ ప్రజానీకానికి శుభదాయకం.
ప్రజాస్వామ్యానికి ప్రధాన ఆధారం సాధారణ ప్రజలే, ప్రజాస్వామ్యంలో ఓటు తూటా కంటే శక్తివంతమైనది. 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పెంపు సంతోషించదగ్గ పరిణామమే. ఎందుకంటే ప్రజల ప్రాతినిధ్యాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయడమే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెరగడం అంటే చట్టసభలలో జరిగే చర్చల్లో ఎక్కువ మంది ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం. 1952, 1963, 1979 లలో చట్టసభల స్థానాల పునర్విభజన మూడుసార్లు జరిగినప్పటికీ 1976 లోని ఇందిరా గాంధీ నిలిపివేసింది. 2002 పునర్విభజన చేసినప్పటికీ స్థానాల సంఖ్య మాత్రం పెరగలేదు. లోక్‌సభలో ఎస్‌సిలకు ప్రస్తుతము ఉన్న 84 స్థానాల నుండి 126 కు, ఎస్‌టిలకు 47 స్థానాల నుండి 70 కి పెరుగుతాయి. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించకుండా చట్టసభలలో స్థానాల పెంపు అనేది అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా అన్నిరాష్ట్రాలతో చర్చించి పెంచాలి. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడానికి అధికారిక ‘జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం’ ప్రపంచంలోనే మొదట 1952లో మన దేశంలో ప్రారంభించారు.
ఈ పథకాన్ని అమలు పరచడంలో దక్షిణాది రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధించి జనాభా పెరుగుదల నెమ్మదింపజేసాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలను పరిశీలించినట్లయితే జనాభా పెరుగుదల రేటు గణనీయంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లలో జనాభా అధికం. ఈ 6 రాష్ట్రాల పెరిగే ఎంపి స్థానాలు 50% ప్రామాణికతతో పెంచితేనే సుమారు 396 స్థానాలు అవుతాయి. పెరిగిన జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే ఈ రాష్ట్రాలలో మరిన్ని ఎంపి స్థానాలు పెరుగుతాయి. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపి స్థానాలు తగ్గిపోతాయి. ఇప్పటికే దక్షిణాది ఉత్తరాది మధ్య ఉన్న అంతరం మరింత పెరుగుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో పార్టీ అయినా కేంద్రంలో సునాయాసంగా అధికారంలోకి రావచ్చు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అంతిమంగా అది బిజెపికి లాభిస్తుందని కాంగ్రెస్ భయపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం ఇప్పటికే వివక్ష చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చట్టసభల స్థానాల పెంపుపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే కేంద్రం మంత్రి పదవులను దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత లేని శాఖలిస్తున్నారని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ఒకసారి దక్షిణాదికి కేటాయించిన మంత్రిత్వ శాఖలను పరిశీలిస్తే కేవలం నిర్మలా సీతారామన్ మాత్రమే ప్రాధాన్యత శాఖను నిర్వహిస్తున్నారు. మిగతా కీలక ప్రాధాన్యత శాఖలన్నీ ఉత్తరాది చేతుల్లోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో చట్టసభ సీట్లను పరిశీలిస్తే 50 శాతం పెంపుదల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి, 17 లోక్‌సభ స్థానాలు 26 కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలు 263కు, 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరుగుతున్నాయి. చట్టసభల స్థానాల పెంపుదల అనేది ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా మనం రాజ్యాంగలో చెప్పుకున్న ‘సమన్యాయం’ ప్రతిపాదికన ఉత్తరాది రాష్ట్రాల, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి అన్యాయం జరగకుండా చట్టసభల స్థానాలను పెంచితే ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచినట్లు అవుతుంది.