
తల్లిదండ్రుల సంరక్షణకు తెలంగాణ చారిత్రాత్మక చట్టం అమలులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను ప్రత్యక్షంగా గమనించిన సంఘటనలను ఆయనే స్వయంగా చెబుతుంటే వృద్ధులైన తల్లిదండ్రులు ఎంత నిర్లక్షానికి గురవుతున్నారో తెలుస్తుంది. ‘ఒకాయన ప్రజాప్రతినిధిగా చాలా పైకి ఎదిగిండు, ఆయన తండ్రికి క్యాన్సర్ వస్తే అప్పుడు ఆయన మంత్రిగా ఉండి, తండ్రిని కనీసం పట్టించుకోలే.. తండ్రిని బజారుకు తీసుకెళ్లి పండ్లు కూడా కొనివ్వలేని పరిస్థితి ఆయనది.. ఇంట్లో తిండి పెట్టీ పెట్టక భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆయన చనిపోతే నాయకులంతా ఆ మాజీమంత్రిని పరామర్శ చేశారే తప్ప ఆ తండ్రి ఎలా చనిపోయాడో ఎవరూ తెలుసుకోలేదు.’ ఇలాంటి వాస్తవ సంఘటనలే తెలంగాణ ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణ చట్టం తీసుకురావడానికి దోహదం చేశాయి. తల్లిదండ్రుల భరణం, వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2007లో అమలులోకి తెచ్చింది. కానీ ఈ చట్టం అమలు కాగితాలకే పరిమితమైంది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రత్యేకత ఏమంటే ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ఎంఎల్‌ఎలు వంటి ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఉద్యోగుల జీతాల్లోంచి 15 శాతం లేదా రూ. 10 వేలు వంతున ఏది తక్కువ మొత్తం అయితే దానినే తల్లిదండ్రుల సంక్షేమం కోసం బదిలీ చేస్తారు. ఈమేరకు సమర్ధంగా నిర్వహించడానికి ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ప్రతిపాదించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే ఆదర్శాన్ని తరచుగా ప్రస్తావించే మన దేశంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక అత్యవసరాన్ని ప్రతిబింబిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తల్లిదండ్రుల సంక్షేమ చట్టం ఎందుకు సరిగ్గా అమలు కావడం లేదన్న ప్రశ్న ఎదురవుతోంది. అంటే అమలు చేసే యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడమే. 2021లో దేశంలో నిర్వహించిన దీర్ఘకాలిక వృద్ధాప్య అధ్యయనం ప్రకారం 2020లో దేశంలో 5.2 శాతం మంది వృద్ధులు తమ కుటుంబీకుల నుంచే లేనిపోని మాటల వేధింపులకు గురయ్యారని తేలింది.
ఇలాంటి వేధింపులు సర్వసాధారమైపోతున్నాయి. తెలంగాణలో ఇలాంటి మాటల వేధింపుల బాధితుల సంఖ్య 2.1 శాతం వరకు ఉందని అధ్యయనంలో బయటపడింది. బాధితులైన వయోవృద్ధుల్లో సగానికి పైగా తమను కుటుంబం నిర్లక్షం చేసిందని నివేదించారు. ఇప్పుడు ఆ వేధింపులు తెలంగాణలో 68% వరకు పెరిగిపోవడం విడ్డూరం. ఇవన్నీ ఆయా వృద్ధులు ఫిర్యాదులు చేస్తేనే తెలిశాయి. మరి వాస్తవానికి చాలావరకు ఫిర్యాదులు చేయలేని సంఘటనలు ఎన్నో ఉన్నా వెలుగు లోకి రావడం లేదు. దీనికి కారణం కుటుంబం పరువు పోతుందనే సామాజిక ధర్మం పాటించి సహనం వహించడం, అలాగే బయటకు చెప్పకూడదని ఒత్తిళ్లు రావడం అని తెలుస్తోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సహజంగా ఉండవలసిన అనుబంధంలో చట్టం జోక్యం చేసుకోవలసిరావడం దురదృష్టకరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్షం చేస్తున్నారో వారు సామాజిక వ్యతిరేకతను ఎదుర్కొంటే తప్ప వారికి గుణపాఠం రాదని ముఖ్యమంత్రి సీరియస్‌గా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టవలసిన అవసరం లేదు.
ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోక తప్పదు. తల్లిదండ్రులను, పెద్దలను దైవంతో సమానమైన ఉన్నత పీఠంపై మన భారత దేశ నాగరికతా సంస్కృతి పట్టంకట్టి ఆరాధిస్తోంది. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా నేడు చాలా మంది వృద్ధులు భావోద్వేగపరమైన వేధింపులను ఎదుర్కొంటుండడం అత్యంత శోచనీయం. తాము పెంచి పోషించిన పిల్లలే తమ సొంత ఆస్తిని గుప్పిటలో పెట్టుకుని తమకు పిడికెడు మెతుకులైనా పెట్టకుండా పీడించడం లేదా స్వంత ఇంటిలోనే నిలువనీడనీయకుండా చివరికి ఊరవతల శ్మశాన వాటికకు బతికి ఉండగానే తరలించడం వంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ అమానవీయ, నైతిక సంక్షోభం ఈ చట్టం వల్ల సమసిపోతుందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. కేంద్రం 2021లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ఎప్పుడైతే అమలులోకి తెచ్చిందో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు అమలులోకి వచ్చాయి.
కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటోంది. అయినప్పటికీ ఈ చట్టాన్ని సమస్య తీవ్రత దృష్టా పకడ్బందీగా అమలు చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. ఈ చట్టంపై విస్తృత అవగాహన కల్పించి సజావుగా అమలయ్యేలా మద్దతు ఇవ్వాలి. ఎవరికి వారు సొంతంగా బతుకుదామని, ఎంతో కొంత సంపాదించుకుందామని స్వతంత్రంగా నిర్ణయించుకోవడంతోనే ఉమ్మడి కుటుంబాలు చిన్నచిన్న పరిమిత కుటుంబాలుగా చీలిపోతున్నాయి. ఈ కుటుంబాలు బాగా అభివృద్ధి సాధించాలని తాపత్రయం పడడంలో తప్పులేదు. కానీ తల్లిదండ్రులు తాము పంచి ఇచ్చిన ఆస్తులను తిరిగి అప్పచెప్పాలని అడగడం లేదు. కుటుంబంలో తమ స్థానాన్ని అడుగుతున్నారు. జీతం ఇచ్చే యజమానికోసం కొన్ని గంటలు పనిచేస్తాం. కానీ జీవితం ఇచ్చే తల్లిదండ్రుల కోసం ఒక్క నిమిషమైనా వెచ్చించలేమా? చట్టం పేరిట కుటుంబాలను బలవంతంగా మెడలు వంచినంత మాత్రాన తల్లిదండ్రులకు సంరక్షణ కల్పించినట్టు కాదు. విస్తృతమైన నాగరికతా సాంస్కృతిక పునరుద్ధరణ పుట్టుకు రావాలి.