Reading Time: 2 minutes
10th Class Maths Paper Leak 2026: యాదృచ్ఛికమా..? లీకా..? పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మరో పేపర్ లీక్‌ కలకలం!

హైదరాబాద్‌, మార్చి 31: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మార్చి 28న జరిగిన పదో తరగతి గణితం ప్రశ్నపత్రం విషయంలో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఈ క్వశ్చన్‌ పేపర్‌లో ఇచ్చిన దాదాపు 8 ప్రశ్నలు ఓ ప్రైవేటు పాఠశాల ప్రాక్టీస్‌ ప్రశ్నలుగా విద్యార్ధులకు ఇచ్చినవి కావడం విశేషం. పదో తరగతి పరీక్షలకు నెల ముందు ఈ ప్రశ్నలన్నీ అచ్చు గుద్దినట్టు సరిగ్గా ఒకేలా ఉండటంతో ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. టెన్త్‌ మ్యాథమెటిక్స్‌ ప్రశ్నపత్రంలో మొత్తం 18 ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఐదు ప్రశ్నలు ఓ స్కూల్‌ తప్పనిసరిగా సాధన చేయాలని విద్యార్థులకు దాదాపు నెల రోజుల క్రితం ఇచ్చింది. మొత్తం 25 ప్రశ్నలు అందులో ఉండగా.. స్వల్ప మార్పులతో అడిగిన తీరు మాత్రం ఒకేటా ఉంది. మరో నాలుగు ప్రశ్నల మోడల్‌ ఒకటేనని, కాకపోతే ప్రశ్నలోని సంఖ్యలు మారాయని చెబుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా అధికారుల దృష్టికి రావడంతో ప్రశ్నపత్రాలు రూపొందించిన సబ్జెక్టు నిపుణులను పిలిచి ఆరా తీస్తున్నారు.

ప్రశ్నాపత్రం రూపొందించిన ఆ టీచర్ల పిల్లలు ఎవరైనా సదరు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారా? ఇంకేమైనా ఆ విద్యా సంస్థతో సంబంధం ఉందా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి గత శనివారం జరిగిన పదో తరగతి గణితం థియరీ ప్రశ్నపత్రంలో ఇచ్చిన ప్రశ్నలు.. నగరంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థ విద్యార్థుల చేత ప్రాక్టీస్‌ చేయించిన మాదిరి ప్రశ్నపత్రంలోనివి కొద్దిపాటి మార్పులతో ఒకేలా ఉన్నాయి. పరీక్షకు ముందు సదరు పాఠశాల నిర్వాహకులు విద్యార్థులకు ప్రాక్టీస్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఆయా ప్రశ్నలను తప్పకుండా ప్రాక్టీస్‌ చేయాలని దేశించారు. మార్చి 28న జరిగిన మ్యాథమెటిక్స్‌ క్వశ్చన్ పేపర్‌లోని 5, 6, 7, 10, 16, 13, 15, 14 నంబర్‌ ప్రశ్నలు విద్యార్థుల చేత సదరు యాజమాన్యం ప్రాక్టీస్‌ చేయించిన ప్రశ్నలు ఒకటి రెండు మార్పులు మినహా మిగతా అంతా ఒకేలా ఉన్నాయి.

అయితే ఇది యాదృచ్ఛికమా..? పునరావృతమా? అనే అనుమానాలకు తావిస్తుంది. కావాలనే తెలివిగా కొద్ది మార్పులతో ప్రాక్టీస్‌ పేపర్‌ను సిద్ధం చేశారా? అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక పేపర్‌ సెట్‌ చేసిన జిమ్మిక్కులు ఉన్నాయా? లేదంటే ఎస్సెస్సీ బోర్డు నుంచే లీక్‌ అయిందా? అనే విషయాలు నిగ్గు తేల్చేపనిలో అధికారులు మునిగిపోయారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.