Reading Time: 3 minutes

భారత సర్వోన్నత న్యాయస్థానం 24 మార్చిన క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్‌సి హోదా వర్తించదని తీర్పుచెప్పిన విషయం తెలుగు ప్రజలకు విదితమే. ప్రచార మాధ్యమాలు ఇదే విషయాన్ని ప్రధాన వార్తగ ప్రచారం చేశాయి. తెలుగునేలపై ఇప్పటికీ ఇదే చర్చ జరుగుతుంది. కొన్ని సంఘాలు సుప్రీం తీర్పును తప్పుపడుతున్నవి. మరికొన్ని ఈ తీర్పును స్వాగతీస్తున్నట్టు ప్రకటనలు ఇస్తున్నవి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆనందపాల్, రామిరెడ్డిలకు చెందిన కేసులో ఈ తీర్పు రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి నాయకులకు ముఖ్యంగా దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆంధ్ర శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు లాంటివారికి ఇది ఒక ఆయుధంగా దొరికింది. సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడాన్ని దళిత మేధావి వర్గం నుండి సాధారణ ప్రజలవరకు తప్పుపడుతున్నారు. ఈ తీర్పు అనేక మంది దళిత క్రైస్తవుల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నది సందేహం లేదు.

కానీ ఇక్కడ సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ఆధారమైన రాష్ట్రపతి ఉత్తర్వు 1950, ఆ ఉత్తర్వు రాజ్యాంగంలో ఉన్న కారణంగా హైకోర్టులు మొదలు సుప్రీం కోర్టు ఈ తీర్పులు వెలువరిస్తున్నవి. ఈ తీర్పు మొదటిసారి వచ్చిందేమీ కాదు. గతంలో అనేక కేసులల్లో సుప్రీం ఇదే విషయాన్ని చెప్పింది. రాష్ట్రపతి (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు 1950 పేర మూడులో చూచించిన ప్రకారం హిందూ మతం పాటించని దళితులు ఎస్‌సి జాబితాలోకిరారు అనేదిదాని సారంశం. కాలనుగుణంగా 1957లో సిక్కుమతం ఆచరిస్తున్న దళితులకు, 1990లో బౌద్ధమతం స్వీకరించిన దళితులకు ఎస్‌సి రిజర్వేషన్ వర్తించేలా భారత పార్లమెంట్ రాష్ట్రపతి ఉత్తర్వుకు సవరణ చేయడం జరిగిందీ. ప్రస్తుతం క్రైస్తవం, ఇస్లాం స్వీకరించిన దళితులకు రాష్ట్ర పతి ఉత్తర్వు ప్రకారం ఎస్‌సి రిజర్వేషన్ వర్తించదు. ఇదే విషయాని సుప్రీం కోర్టు చెప్పింది. వివిధ రాష్ట్రాల నుండి సిఫారసు చేయబడిన దళితులను ఎస్‌సిలుగా గుర్తించి ఆ కులాలను ఎస్‌సి రిజర్వేషన్ జాబితాలో చేర్చే అధికారం ఆర్టికల్ 341 ప్రకారం భారత రాష్ట్రపతికి ఉన్నది.

ఆనాడు మొదటి ఎస్‌సి జాబితాను ఈ దేశ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 10 ఆగస్టు 1950 నాడు రాష్ట్రపతి ఉత్తర్వు ఇవ్వడం జరిగినది. సెక్యులర్ అనే పేరుతో క్రైస్తవులను ఓటు బ్యాంకుగా మార్చుకుని దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు తీరని మోసం చేసింది. ఆనాడు ఈ రాష్ట్రపతి ఉత్తర్వును అన్యాయంగా రాజ్యాంగంలో చేర్చిన నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నెహ్రూ ప్రభుత్వమే. 1956లో దళిత సిక్కులకు ఎస్‌సి రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవులకు మొండి చేయి చూపింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మొదటినుంచి బాహాటంగానే దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. 2004 తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిఎం అయ్యాక దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మెజారిటీ సభ్యుల ఆమోదంతో జరిగిన తీర్మానాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. ఆనాడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. వైయస్ రాజశేఖర్ రెడ్డి దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ధితో ఉన్నా అనాటి కాంగ్రెస్ పట్టించుకోలేదు. బిజెపి దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేఖిస్తుంది. ఎందుకంటే ఇతర మతాల వారు ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరులు అనే సిద్ధాంతంతో ఉన్న బిజెపి దళిత క్రైస్తవ సమాజానికి రావలసిన ఎస్‌సి రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం సహజం. సుప్రీం కోర్టుకు వివరణ కోసం మోడీ ప్రభుత్వం ఇదే విషయంపై అధ్యయనం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బాలకిషన్ కమిషన్ ఏర్పాటు చేసింది.

ఆ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. మతం మారిన దళితులపై వివక్ష లేదు అని అనుకోవడానికి వీలు లేదు. అదే నిజమైతే కారంచేడులో హత్యకు గురైన మాదిగలు అందరూ క్రైస్తవ నేపథ్యం ఉన్నవారే. అయినప్పటికీ కారంచేడు అగ్రకుల దాడి దేశంలోనే సంచలనం సృష్టించింది. చుండూరులో హత్యకు గురైన మాలలు కూడా చర్చి నేపథ్యం ఉన్నవారే. ఇవే కావు ఇలాంటి అనేక సంఘటనలు దేశవ్యాప్తంగా ఉన్నవి. మతం మారినంత మాత్రాన దళితులపై సమాజ వైఖరి మారలేదు. అంతేకాదు మతం మారిన దళితులపై ముఖ్యంగా దళిత క్రైస్తవులపై దాడులు పెరిగినవి తప్పితే తగ్గలేదు. హిందూ విశ్వాసంలో ఉన్న దళితులపై కులం పేరుతో అగ్రకులాలు దాడి చేస్తే, దళిత క్రైస్తవులపై కులం పేరుతోపాటు, మతం పేరుతో కూడా దాడులు జరుగుతున్నవి. హిందూ మతం వదిలి వెళ్ళిన తరువాత అంటరానితనం క్రైస్తవంలో లేదు. అలాంటప్పుడు ఎస్‌సి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది బిజెపి వాదన.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ దేశంలో దళితులు సామాజికంగా అణచివేయబడ్డారు. ఈ దేశం మొత్తం దళితులను అంటరానివారుగా చూచింది. చర్చిలో కులం లేదు, కానీ ఈ దేశంలో భాగమైన బడిలో కులం ఉన్నది, సంతలో కులం ఉన్నది, ప్రభుత్వ కార్యాలయాల్లో కులం ఉన్నది, పాలనలో కులం ఉన్నది. చర్చిలో కులం లేకున్నా ఊరు ఉమ్మడి ఆస్తి అయిన మంచినీళ్ళ చెరు వుకాడ కులం ఉన్నది. ఒక క్రైస్తవుడు జీవించేది చర్చిలో కాదు. ఈ దేశంలో అందునా కులం పేరుతో విడిపోయిన ఈ సమాజంలో కులం ఉన్నది. ఆరాధన పద్ధతిలో తేడా, నమ్మే దేవునిలో తేడా అంతేకానీ అణచివేత ఒక్కటే. సమాజంలోఉన్న కులఅణచివేత లేదాకుల గుర్తింపు మతవిశ్వాసాన్ని బట్టి రాలేదు.

పుట్టిన ఇంటిని బట్టి వచ్చిది అనే విషయాన్ని గుర్తించాలి. దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ సాధనకు ఐక్యసంఘటిత ఉద్యమమే పరిష్కారం. వర్గీకరణ పేరుతో విడిపోయిన మాలమాదిగలు దళిత క్రైస్తవ ఎస్‌సి రిజర్వేషన్ కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇద్దరి సమస్య, ఇక్కడ చర్చికి వెళ్ళే మాలలు, మాదిగలు బాధితులే వీరు మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో 59% కులాల సమస్య. కాబట్టి మాలమహానాడుతోనో, మాదిగదండోరాతోనో సాధ్యం కాదు. కొత్త నాయకత్వమే ముందుకు రావాలి. దలిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ కల్పించడానికి రెండు మార్గాలు. పార్లమెంటులో రాష్ట్రపతి ఉత్తర్వు 1950కి సవరణ చేసి ఆమోదించడం లేదా రాష్ట్రపత్తి ఉత్తర్వు 1950ను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం. పైరెండు మార్గాల ద్వారా దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ పొందే వీలు ఉన్నది.  

– వలిగొండ విజయరాజు

81434 46626