Reading Time: < 1 minute

ఇందిరా పార్కులో కబ్జాలకు చెక్.. పాత్ స్కేటింగ్ రింగ్ స్థలాన్ని కాపాడిన హైడ్రా

Caption of Image.
  • ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్, వెలుగు: లోయర్ ట్యాంక్ బండ్​లోని ఇందిరా పార్కులో జరుగుతున్న కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టంది. పార్కులోని పాత స్కేటింగ్ రింగ్ ఆక్రమణకు గురవుతోందని ప్రజావాణిలో వాకర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం  క్షేత్రస్థాయిలో పర్యటించారు. పార్కులో కొత్త స్కేటింగ్ రింగ్ అందుబాటులోకి రావడంతో ఖాళీగా ఉన్న పాత చిన్న స్కేటింగ్ రింగ్ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. 

సమ్మర్ క్యాంప్ పేరుతో కరాటే నేర్పుతానని ప్రవేశించిన సఫీ అనే వ్యక్తి.. వేసవి తర్వాత కూడా దానిని శిక్షణ కేంద్రంగా వాడుకుంటూ పిల్లల వద్ద ఫీజులు వసూలు చేస్తూ ఆ స్థలాన్ని విస్తరించేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం రూ. 30 లక్షల నిధులు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​ను కోరగా, ఆయన కలెక్టర్​కు ప్రతిపాద‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు పంపారు. జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అనుమతులు ఉంటేనే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 

అయితే అనుమతులవే వస్తాయని కాంట్రాక్టర్ రవీందర్​రెడ్డితో పనులు ప్రారంభించారు. నిర్మాణాలు చేపట్టడానికి జేసీబీలు వెళ్లేందుకు వీలుగా పార్కు లోపలి వైపు ప్రహరీని కూల్చివేసి రాడ్లు, నిర్మాణ సామగ్రిని డంప్ చేశాడు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కార్యాలయం పక్కనే ఈ అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వాకర్స్ హైడ్రాను ఆశ్రయించారు. 

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ రంగనాథ్..  వెంటనే నిర్మాణాలను నిలిపివేయించి ప్రహరీని పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రహరీ కూల్చిన రవీందర్ రెడ్డిపై దోమలగూడ పోలీస్ స్టేషన్​లో క్రిమినల్ కేసు నమోదు చేయించడంతో పాటు, కొత్త స్కేటింగ్ రింగ్ అందుబాటులోకి వచ్చినందున పాత స్థలాన్ని వెంటనే ఇందిరా పార్కులో విలీనం చేయాలని అధికారులను ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.