Reading Time: 3 minutes

భారత ప్రధాని మోడీ తనకెంతో మంచి మిత్రుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వంక పొగుడుతూ మరోవంక ప్రతిసారి ఎంతో చులకనచేయడం పరిపాటిగా మారింది. అంతేకాదు ఒకవైపు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ మరోవైపు అడ్డూఆపూ లేకుండా భారత ఉత్పత్తులపై టారిఫ్‌ల భారాన్ని అమాంతంగా పెంచేస్తున్నారు. బుధవారం (7.1.2026)మీడియా ముందు ట్రంప్ మాట్లాడుతూ అమెరికా నుంచి భారత్ 68 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తోందని, వాటిని పొందాలంటే ఐదేళ్ల వరకు ఆగాల్సిందేనని వెల్లడించారు. వాస్తవానికి భారత్ కేవలం 28 అపాచీ హెలికాప్టర్లకే అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది. వీటిలో 22 హెలికాప్టర్లకు 2015లో భారత వైమానిక దళం కోసం, ఆర్డరు ఇవ్వగా, 201920 వాటిని సర్వీస్ లోకి చేర్చుకుంది. అలాగే భారత సైన్యం కోసం మరో ఆరింటికి 2020లో ఆర్డరు ఇవ్వగా 2025 డిసెంబర్ నా టికి అన్నీ డెలివరీ అయ్యాయి. అయితే పెండింగ్ రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అవసరాలకు సంబంధించి మోడీ తనను “సర్! మిమ్మల్ని కలియవచ్చా? ”అని వినమ్రంగా ప్రాధేయపడ్డారని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇక రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై మోడీ చిందులు తొక్కుతున్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఇప్పటికే భారత్‌కు 50 శాతం సుంకాలు ట్రంప్ అదనంగా విధించిన సంగతి తెలిసిందే. ఇంతటితో ఆగడం లేదు. ఉక్రెయిన్‌లో పుతిన్ రక్తపాతం సాగిస్తున్నారని, దీనికి పరోక్షంగా భారత్, చైనా, బ్రెజిల్, నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపిస్తూ 500 శాతం వరకు సుంకాలు విధించేందుకు ఇప్పుడు రంగం సిద్ధం కావడం గమనార్హం. దీనికి సంబంధించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మనదేశంపై 500 శాతం వరకు సుంకాల భారం పడుతుంది. రష్యా చమురు కొనుగోలు దారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ఒక పక్క వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్ అమెరికా మధ్య చర్చలు కొనసాగుతుండగా, 500 శాతం వరకు సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది.

ఈ విధంగా సుంకాలు విధించడం ద్వారా తమ దేశానికి 65,500 కోట్ల డాలర్ల మేరకు సంపద చేరుతోందని ట్రంప్ గర్వంగా ప్రకటించుకున్నారు. ఇదే విధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఎలా సుంకాల ద్వారా లొంగదీసుకునేదీ ట్రంప్ ఎగతాళి చేస్తూ చెప్పుకొచ్చారు. టారిఫ్‌ల బెదిరింపుల తోనే ఔషధ ధరల విషయంలో ఫ్రాన్స్ మెడలు వంచానని వ్యాఖ్యానించారు. అమెరికన్లు ఫ్రెంచి ప్రజల కంటే 14 రెట్లు ఎక్కువగా ఔషధ ధరలు చెల్లిస్తున్నారు. ఈ అసమానతను తగ్గించేందుకు ఫ్రాన్స్‌పై ఒత్తిడి తెచ్చానన్నారు. వైన్, షాంఫేన్‌సహా అన్ని రకాల ఫ్రెంచి ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని హెచ్చరించడంతో ఫ్రెంచి అధ్యక్షుడు దిగివచ్చినట్టు ట్రంప్ ఎద్దేవా చేశారు. ట్రంప్ ఆదేశించినట్టు ఫ్రాన్స్‌లో ఔషధ ధరలను 200 శాతం వరకు పెంచారు. దీనికి ట్రంప్ “మోస్ట్‌ఫేవర్డ్ నేషన్‌”(ఎంఎఫ్‌ఎన్) విధానం అనుసరించారు. దీనివల్ల అమెరికాలో ధరలు తగ్గుతాయంటున్నారు.

ఈ విధానం ప్రకారం అమెరికా మెడికేర్ చెల్లింపులు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోని కనిష్ఠ ధరలకు అనుసంధానించబడతాయి. అలా అత్యల్ప ధర ఉన్న దేశం ధరను మాత్రమే చెల్లించేందుకు ఫెడరల్ సర్కార్ ముందుకు వస్తుంది. ట్రంప్ అనుసరించిన విధం వల్లనే అమెరికాలో ఔషధాల ధరలు 400 నుంచి 600 శాతం తగ్గాయని తెలుస్తోంది. వెనెజులా కొత్త ప్రభుత్వానికి కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో ఆర్థికసంబంధాలు ఏమాత్రం పెట్టుకోవద్దని హుకుం జారీ చేశారు. చమురు ఉత్పత్తిలో, వాణిజ్యంలో అమెరికాకే భాగస్వామ్యంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని షరతు విధించారు. ముఖ్యంగా హెవీ క్రూడ్ ఆయిల్ విక్రయాల్లో అమెరికాకే ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. వెనెజులా చమురును అమెరికా సర్కారు బ్యారెల్ 56 డాలర్ల ధరకు అమెరికా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ట్రంప్ అనుకున్నట్టు రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయవచ్చు. 2.8 బిలియన్ డాలర్ల విలువైన చమురు, చమురు సంబంధిత ఉత్పత్తులను వెనెజులా నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా అన్నీ సవ్యంగా జరిగితే అమెరికా రోజువారీ అవసరాల కంటే అత్యధిక శాతం చమురు వెనెజువెలా నుంచి దిగుమతి అవుతుందని యూఎన్ ఎనర్జీ ఇన్‌ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసింది. ఇక మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా విధించబోయే 500 శాతం సుంకాలు అమలు లోకి వస్తే ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మన వాణిజ్యరంగం మరిన్ని ఆటుపోట్లకు గురికావచ్చు.

భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వాటిలో ముత్యాలు, రంగురాళ్లు, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల రత్నాల ఎగుమతులు సగానికి సగం పడిపోయాయని లండన్ కేంద్రంగా ఉన్న రత్నాల వాణిజ్య సంస్థ డి బీర్స్ గ్రూప్ వెల్లడించింది. 2024 లో భారత్ నుంచి విదేశాలకు 13 బిలియన్ డాలర్ల విలువైన రత్నాల ఎగుమతులు కాగా, వీటిలో 50 శాతం అమెరికాకు ఎగుమతి అయ్యాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ మొత్తం 119.7 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తుల విలువ 77.50 బిలియన్ డాలర్ల వరకు ఉండడం గమనార్హం. ఇలాంటి భారత వాణిజ్యరంగం ట్రంప్ ప్రతీకార సుంకాలతో తీవ్ర అలజడులకు గురవుతుండడం శోచనీయం