
బంగ్లాదేశ్‌లో 2026 సాధారణ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ మార్పులు భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. ఈ దశలో భావోద్వేగాల కంటే ఆచితూచి తీసుకునే వ్యవహారిక దృక్పథమే ప్రాధాన్యం పొందుతోంది. ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) తిరిగి అధికారంలోకి రావడం ఢాకా రాజకీయ పరిస్థితిని మార్చినప్పటికీ, ఇరుదేశాల మధ్య సహకారానికి ఉన్న ప్రాథమిక తర్కాన్ని మార్చలేదు. బదులుగా, పరస్పర అవసరాల ఆధారంగా మరింత మౌనంగా, లావాదేవీలకు దగ్గరగా ఉండే సంబంధం రూపుదిద్దుకుంటోంది. గత దశాబ్దానికి పైగా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు షేక్ హసీనా, అవామీ లీగ్‌తో ఉన్న సన్నిహిత భాగస్వామ్యంపై ఆధారపడ్డాయి. భద్రత, కనెక్టివిటీ రంగాల్లో విశ్వాసం, సహకారం అత్యున్నత స్థాయికి చేరాయి.
భారత వ్యతిరేక తిరుగుబాటుదారులపై హసీనా ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు, ఆర్థిక మౌలిక వసతుల బలోపేతానికి చూపిన సంసిద్ధత, న్యూఢిల్లీ దృష్టిలో ఈ సంబంధాలను దక్షిణాసియాలో ఆదర్శంగా నిలిపాయి. అయితే ఆ రాజకీయ వ్యవస్థ అకస్మాత్తుగా ముగియడం, అనంతరం హసీనా భారత్‌లో ఉండటం, దౌత్య సమీకరణాలను క్లిష్టతరం చేశాయి. బిఎన్‌పి తిరిగి అధికారంలోకి రావడంపై మొదట న్యూ ఢిల్లీలో ఆందోళనలు ఉన్నప్పటికీ.. భారత్‌పట్ల గతంలో చూపిన సందిగ్ధత, వ్యతిరేక వైఖరి (కొన్నిసార్లు) కారణంగా.. ఇప్పుడు అవి సమతుల్య అంచనాలకు మారుతున్నట్లు కనిపిస్తోంది. గత అనుమానాలు, ప్రస్తుత సంబంధాలను ప్రభావితం చేయనివ్వకూడదనే భావన ఇరువైపులా స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తారిక్ రెహ్మాన్‌ను సంప్రదించడం, దానికితోడు ఢాకా నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, సందేశాలు, భౌగోళికఆర్థిక వాస్తవాలు విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని ఇరుదేశాల అవగాహనను సూచిస్తున్నాయి. భారత్ స్పందన గమనించదగ్గ రీతిలో మితమైనదిగా ఉంది.
ఆర్భాట నిర్ణయాల కంటే, క్రమంగా ముందుకు సాగే చర్యలను న్యూఢిల్లీ ఎంచుకుంది. ఇంధనం వంటి కీలక సరఫరాల పునరుద్ధరణ, వీసా ప్రక్రియల సడలింపు, చర్చల సంస్థాగత మార్గాల పునఃప్రారంభం వంటి చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని, సంబంధాలను స్థిరపరచడమే లక్ష్యంగా నిశ్శబ్ద దౌత్యాన్ని అమలు చేస్తోంది. ఇది భారత్ పొరుగు దేశాల విధానంలో చోటుచేసుకుంటున్న మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ విధానం ఆదర్శాల కంటే కొనసాగింపు, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తుంది. బిఎన్‌పి ప్రభుత్వానికి ప్రధాన సవాలు దేశీయ రాజకీయ అవసరాలు, అంతర్జాతీయ వాస్తవాల మధ్య సమతుల్యత సాధించడం. తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ విదేశాంగాన్ని విభిన్న దిశల్లో విస్తరించాలనే సంకేతాలు ఇచ్చారు. ఇది భారత్ వ్యతిరేక ధోరణిగా భావించాల్సిన అవసరం లేదు. చైనా, పాశ్చాత్యదేశాలు, ఇతర ప్రాంతీయ భాగస్వాములతో సంబంధాలు పెంచుతూ, న్యూఢిల్లీతో ప్రామాణిక సంబంధాలను కొనసాగించాలనే వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని ఇది సూచిస్తుంది.
ఆర్థిక సంబంధాలు ఇరుదేశాల మధ్య బలమైన ఆధారం. వాణిజ్యం, ఇంధన సహకారం, కనెక్టివిటీ ప్రాజెక్టులు పరస్పర ఆధారిత వ్యవస్థను ఏర్పరిచాయి. భారత్ బంగ్లాదేశ్‌కు ముఖ్య ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ భారత ఈశాన్య రాష్ట్రాలకు కీలక రవాణా మార్గాలను అందిస్తోంది. ఈ పరస్పర ఆధారిత వ్యవస్థను భంగం కలిగించడం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సహకారాన్ని పునర్నిర్మించుకోవడం అవసరమే. బంగ్లాదేశ్‌కు ఇంధన భద్రత, ఎగుమతుల విస్తరణ వంటి లక్ష్యాల సాధనకు భారత్‌తో స్థిరమైన సంబంధాలు అవసరం. భారత్‌కు కూడా బంగ్లాదేశ్ పొరుగు ప్రాంతానికే మొదటి ప్రాధాన్యత విధానంలో కీలక భాగస్వామి మాత్రమే కాకుండా, ఆగ్నేయాసియాతో అనుసంధాన లక్ష్యాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే, షేక్ హసీనా భారత్‌లో ఉండటం అత్యంత సున్నిత అంశంగా నిలుస్తోంది.
ఒకవైపు ఆమె భారతదేశానికి అత్యంత సమీప మిత్రురాలు కాగా, మరోవైపు ఢాకాలోని కొత్త ప్రభుత్వం ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇలాంటి పరిస్థితిలో భారత్ తీసుకునే నిర్ణయం దౌత్య చాతుర్యానికి పరీక్షగా మారుతుంది. హసీనాను అప్పగిస్తే పాత భాగస్వామ్యానికి ద్రోహం చేసినట్లు అవుతుంది; తిరస్కరిస్తే ప్రస్తుత ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి తాత్కాలికంగా స్పష్టత లేని, సమతుల్య విధానాన్ని అనుసరించే అవకాశమే ఎక్కువ. భద్రతా అంశాలు కూడా ఈ సంబంధాల్లో కీలకంగా ఉన్నాయి. గతంలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్‌లో స్థలం లభించిన అనుభవం న్యూఢిల్లీ వ్యూహాత్మక ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించకపోయినా, భారత్ అప్రమత్తంగా గమనిస్తోంది. ఉగ్రవాద నిరోధం, గూఢచారి సమాచార పంపకం వంటి రంగాల్లో సహకారం, విశ్వాసాన్ని పెంచడం అవసరం.
భారత్ ఈశాన్య ప్రాంతానికి ఈ సంబంధాల ప్రాధాన్యం మరింత ఎక్కువ. బంగ్లాదేశ్ పోర్టులకు ప్రవేశం, రహదారి రైల్వే కనెక్టివిటీ, ఆర్థిక కారిడార్ల అవకాశాలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డాయి. సంబంధాలు బలహీనపడితే తిరుగుబాట్లు, అక్రమ వలసలు, ఆర్థిక ఒంటరితనం వంటి పాత సమస్యలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. విస్తృత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ చైనాతో పెంచుకుంటున్న సంబంధాలు భారత్‌కు సవాలుగా మారుతున్నాయి. ఇవి పోటీని పెంచినా, ఆర్థిక దౌత్యం, మౌలిక వసతుల పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాల్లో భారత్ మరింత చురుకుదనం చూపాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. మొత్తంగా చూస్తే ఇది విభేదం కాదు, పునర్వ్యవస్థీకరణ. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు భావోద్వేగ దశ నుంచి వ్యావహారిక దశకు మారుతున్నాయి.
ఈ మార్పు వేడి తగ్గించినప్పటికీ, దీర్ఘకాలంలో మరింత స్థిరత్వాన్ని అందించే అవకాశముంది. దక్షిణాసియాలో రాజకీయ మార్పులు ఒక్కసారిగా విదేశాంగ విధానాలను మార్చే పరిస్థితుల్లో, ఇరుదేశాలు సంయమనంతో, దూరదృష్టితో ఈ మార్పును నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వాలు మారినా భౌగోళిక వాస్తవాలు మారవని ఇది మరోసారి రుజువు చేస్తోంది. రానున్న నెలలు రెండు దేశాలకూ కీలకం. షేక్ హసీనా అంశం వంటి సున్నిత విషయాలను సమర్థంగా పరిష్కరించగలిగితే, భద్రతా సహకారం కొనసాగితే, ఆర్థిక బంధాలు మరింత బలపడితే, ఈ దశ స్థిరమైన భాగస్వామ్యంగా మారే అవకాశం ఉంది. లేకపోతే పాత అనుమానాలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పునర్నిర్మాణం గతంతో విరామం కాదు.. కొత్త రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా తీసుకున్న సమతుల్య అడుగు. అంతర్జాతీయ సంబంధాల్లో అవసరాలు చాలా సార్లు సిద్ధాంతాలను మితిమీరకుండా కట్టడి చేస్తాయని స్పష్టం చేస్తోంది.
– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు