Reading Time: 3 minutes

‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదం ఇచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకోసం “సత్యమైన” మార్గాన్ని అనుసరించగలరనే అభ్రిపాయం మొదట ఇంటా బయటా కూడా కొంత ఏర్పడింది. కాకపోతే, సామ్రాజ్యవాదులకు “సవ్యమైన” మార్గ మంటే అందులో ప్రపంచానికి గతం నుంచి తెలిసిన దోపిడీ పద్థతులు, బలప్రయోగాలు ఒకమేరకు ఉండ వచ్చుననుకున్నారు. అం దుకు మానసికంగా సిద్ధపడ్డారు కూడా. కాని, ఆ విధమైన పద్ధతిలోనూ అమెరికాను మళ్ళీ ‘గ్రేట్’ చేయగల సమర్థత తనకు లేదని రుజువు చేసుకుంటూ ఆయన రౌడీ మార్గంలోకి దిగారు. రౌడీ చర్యలు ఏమిటో కనిపిస్తున్నవే.

వనరులు, మార్కెట్ల కోసం ఇతర దేశాలను ఆక్రమించుకోవటం, వలసవాదం, నయా వలసవాదం, ఇటీవలి దశాబ్ధాలలో కొత్త తరహా దోపిడీల కోసం ఆర్థిక సంస్కరణలు, డబ్లుటిఓ వంటివి పాశ్చాత్య దేశాలకు అలవాటుగా సాగిన పాత విధానాలే. ఈ దోపిడీకి నాయకత్వం చిరకాలం ఇంగ్లాండ్ ది కాగా, ముఖ్యంగా రెండవ ప్రపంచయుద్ధం తర్వాత నుంచి అమెరికాది అయింది. అది వారి “గొప్పతనం” అయింది. కాని, 21వ శతాబ్దం వచ్చి కాలం గడిచినా కొద్దీ ఆ “గొప్పతనం” బీటలు వార సాగింది. రష్యా తిరిగి బలపడి, చైనా ఒక సవాలుగా మారి, బ్రిక్స్ తదితర మార్గాలలో బహుళ ధృవ ప్రపంచం నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తుండటంతో ఆ బీటలు పెరగటం మొదలైంది. దానితో “మేక్ గ్రేట్ అగైన్’ నినాదం పుట్టుకు వచ్చింది.

దానికదిగా అందులో తప్పుపట్ట వలసింది లేదు. ఎవరి దేశాన్ని వారు గొప్పది చేసుకోవచ్చు. ఒకప్పటి గొప్పతనం పోతు న్నదను కుంటే మళ్ళీ గొప్పదిగా చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. కాని ఏ పద్ధతిలోనన్నది ప్రశ్న. ఆ పద్ధతి ప్రపచానికి మొదటి నుంచి తెలిసిన సామ్రాజ్యవాద పద్ధతులు అయినా ఆమేరకు అర్ధం చేసుకోవచ్చు. కాని, ట్రంప్ వ్యక్తిత్వం, స్వభావం తనకన్న ముందటి వరకు గల సామ్రాజ్యవాద అధ్యక్షుల కన్న భిన్నమైనవి. ఏ విధంగా భిన్నమో చూస్తూనే ఉన్నాం. ఆయన రెండవ విడత అధ్యక్ష కాలం గజిబిజిగా, అరాచకంగా, అయోమయంగా మొదలై, ఇపుడు ఒక సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించే సరికి పట్టపగటి రౌడీయిజం, బందిపోటు శైలిలోకి మారింది. ఈ పదాలు తీవ్రంగా తోచవచ్చు. కాని అంతకన్న సరైన పదాలు కనిపించవు.

ట్రంప్ ఈసారి అధికారానికి రాగానే అమెరికన్ కంపెనీలు ఇతర దేశాల నుంచి స్వదేశానికి రాకపోతే పన్నులు పెంచుతానని హెచ్చరించటంతో మొదలుపెట్టి, తమ మిత్ర దేశాలతో సహా ప్రపంచ దేశాలు అన్నింటిపై భారీగా సుంకాలు పెంచటం వరకు ఎన్నెన్ని చర్యలు తీసుకున్నారో తెలిసిందే. ఆ జాబితా ఇక్కడ రాయ నక్కర లేదు. కాని చెప్పుకోవలసింది ఏమంటే, అవన్నీ సరైనవి అయినా కాకున్నా కనీసం ఒక పద్ధతిలో జరిగాయి. ఆ పద్ధతిలోనే తమ ఆదాయాలను పెంచుకుని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కటం, తిరిగి ఉత్పత్తి పరిశ్రమలను పెంచటం, అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించటం వంటివి చేసి ఉంటే ఒక విధంగా జరిగి పోయేది. తక్కిన ప్రపంచం కష్టమైనా, నష్టమైనా సర్థుకుపోయి, అవసరమైనపుడు అమెరికాతో రాజీలు పడేది.

కాని, ట్రంప్ ఒకవైపు ఈ చర్యలు తీసుకుంటూనే మరొక వైపు ఇంకొక విధమైన మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ ఇంకొక విధమైనవే ఇపుడు, అమెరికా సామ్రాజ్యవాద చరిత్రలోనే ఎపుడూ లేని తీరుగా వెనిజులాపై అర్ధరాత్రి ఆకస్మిక దాడికి దిగి ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించుకు పోవటంగా పరిణమించింది. గతంలో పనామా నేత నొరైగాను కూడా అప హరించినా ఆయన అధికారికంగా ప్రభుత్వాధ్యక్షుడో, ప్రధాన మంత్రో కాడు. ట్రంప్ కొంతకాలం పాటు, పనామా కాల్వను తమ అధీనం చేయకపోతే సైనికంగా ఆక్రమించుతాం, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం పరచకుంటే కొనుగోలు చేస్తాం లేదా సైనికంగా వశపరచు కుంటాం. కెనడాను 51వ రాష్ట్రంగా మార్చుతాం, గాజాను తాము నేరుగా గాని ఇజ్రాయెల్ ద్వారా గాని ఆక్రమించి రిసార్ట్‌గా మారు స్తాం, ఉక్రెయిన్‌లోని ఖనిజ నిల్వలను ఆ ప్రభుత్వం తమకు రాసి వ్వాలి తరహాలో మాట్లాడుతూ వచ్చారు. అటువంటి భాష, ధోరణి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి కాలంలో అమెరికా సహా ఏ సామ్రాజ్యవాద దేశం నుంచి కూడా విన రాలేదు. అవన్నీ ఆయా దేశాలపై వత్తిడిని సృష్టించి చివరకు చర్చల ద్వారా తమకు అను కూలమైన ఒప్పందాలు చేయించుకునే ఎత్తుగడ మాత్రమేననే అభిప్రాయం కలిగింది.

అటువంటి అభిప్రాయం భ్రమ మాత్రమేనని వెనిజులా పరిణామంతో తేలిపోయింది. వెనిజులా అధ్యక్షుడు మాదకద్రవ్య రవాణాలు చేస్తున్నారనే అసత్యపు ఆరోపణలతో అక్కడ యుద్ధ నౌకలను, సైన్యాలను మోహరించటం. వత్తిడిని సృష్టించేందుకు మాత్రమే నని ప్రపంచం సాధారణంగా అభిప్రాయ పడింది. కాని ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి అకస్మాత్తుగా ఊహించలేనిది జరిగింది. అది రౌడీయిజం, బందిపోటు కన్న ఎంత మాత్రం భిన్నమైనది కాదు. ఇక దేశాధ్యక్షుడు నికోలస్ మదురో దంపతుల అపహరణతో ఆరంభించి జరుగుతున్న వన్నీ అదే కోవలోకి వస్తాయి. వారిపై అసత్యపు ఆరోపణలతో కేసులు మోపి విచారిస్తుండటం, వెనిజులాను తామే పరిపాలించగలమన్న ప్రకటన, అక్కడ చమురు నిల్వలన్నింటిని తమ స్వాధీనం చేయాలనటం, అమెరికన్ చమురు కంపెనీలకు అవసరమైతే తామే రుణాలిచ్చి ఆ నిల్వలు వెలికితీసి వ్యాపారం చేయించగలమనటం, ఆ చమురు అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని తన ప్రభుత్వ పరం చేస్తే తానే ఖర్చు చేయగలమనటం, వారు అమెరికన్ ఉత్పత్తులను మాత్రమే ఖరీదు చేయాలనటం, వెనిజులా నుంచి రష్యన్, చైనీస్, క్యూబన్, దానియన్ కంపెనీలను వెంటనే పంపివేయటంతో పాటు వారితో అన్ని రకాల ఆర్థిక సంబంధలను తెంపి వేసుకోవాలనటం అన్నీ ఆ విధమైనవే. ఇటు వంటివి ఒకప్పుడేమోగాని ఆధునిక కాలంలో జరగటం నమ్మలేని విషయం. అందుకే ప్రపంచం యావత్తు కేవలం ఆశ్చర్యపడటం గాక దగ్భ్రాంతి చెందింది.

అంతటితో ఆగని ట్రంప్, వెనిజులాలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకున్న డెల్సీ డోడ్రిగ్జ్‌ను, తాను ఆదేశించినట్లు నడుచుకోకపోతే తిరిగి దాడులు జరపగలమని హెచ్చరిస్తు న్నారు. అంతేకాదు, ఆదేశ పరిపాలనను పర్యవేక్షించేందుకు వెంటనే ఒక కమిటీని కూడా నియమించివేసారు. ఇదే రౌడీ చర్యలకు కొనసాగింపుగా, అదే లాటిన్ అమెరికాలోని కొలంబియా, మెక్సికో, క్యూబాలను పశ్చిమాసియాలోని ఇరాన్‌ను సైతం హెచ్చరించారు. ఇరాన్‌లో ఆర్థిక సమస్యల వల్ల కొద్ది రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అటువంటిది అంతటా సాధారణమే. కాని, ఒకవేళ ప్రదర్శనకారులపై కా ల్పులు జరిపితే అమెరికా సైనిక చర్య తీసుకో గలదంటూ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పట్ల ఇజ్రాయెల్, అమెరికాల కక్ష ఎందుకో తెలిసిందే. లోగడ వారు అణ్వాయుధాలకు సిద్ధపడు తున్నారనే తప్పు ఆరోపణలతో దాడులు జరిపిన తర్వాత ఇపుడు ప్రజల నిరసన ప్రదర్శనలను సాకుగా ఎంచుకోవటం రౌడీ చర్యగాక మరొకటి కాజాలదు. ఇదే వరుసలో ఆయన, గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం, అందుకు “అవసరమైతే” బల ప్రయోగం గురించిన హెచ్చరికలు మొదలుపెట్టి, ఏమి జరిగేదీ “20 రోజుల తర్వాత” చూస్తారని అంటున్నారు. ఇదే ధోరణి కొనసాగి ఇంకా ఏమేమి చేయగలరా అన్నది ప్రపంచానికంతా ఉత్కంఠగా మారింది. కొన్నింటిని అక్ష రాలా భయపెడుతున్నది.

ఇంతకూ ఇటువంటి రౌడీ ధోరణిలో అమెరికా తన అంతరిస్తున్న “గొప్పతనాన్ని” కాపాడుకోగలదా, పోయిన వైభవాన్ని తిరిగి రాబట్టుకో గలదా అన్నది అసలు ప్రశ్న. తార్కికంగా చూసి నపుడు అటువంటి అవకాశాలు కన్పించవు. ఎందుకంటే, తమ మిత్రులతో సహా ప్రపంచ దేశాలతో సవ్యమైన సంబంధాల ద్వారా మళ్లీ ఆర్థికంగా, రాజకీయంగా పుంజుకునే బదులు, ఇటువంటి మార్గాన్ని అనుసరించటంలో కనిపిస్తున్నది ట్రంప్ అవివేకం మాత్రమే. అది సంచలనాలను సృష్టించటం మినహా దీర్ఘకాలంలో ఫలితాలనివ్వబోదు.

టంకశాల అశోక్