పెళ్లిళ్లు, బర్త్ డే లేదా ఇతర ఏదైనా పంక్షన్లకు వెళ్లినప్పుడు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇక క్రిస్మస్, దీపావళి లాంటి పండుగల సమయాల్లో కూడా బహుమతులు పంచుకోవడం తెలిసిందే. అయితే ఇప్పటివరకు గిఫ్ట్‌లు అంటే ఎదుటివారికి నచ్చే, ఉపయోగపడే వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. కానీ త్వరలో మీరు మ్యూచువల్ ఫండ్ల గిఫ్ట్ కార్డులు, గిఫ్ట్ ప్రీపెయిడ్ కార్డులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. వీటిని ప్రవేశపెట్టాలని తాజాగా సెబీ ప్రతిపాదించింది.
మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, ఆర్ధిక పెట్టుబడులపై ప్రజలకు అవగాహన పెంచేందుకు సెబీ ఈ కొత్త ప్రతిపాదన చేసింది. మ్యూచువల్ ఫండ్ గిఫ్ట్ కార్డులను మీరు మరొక వ్యక్తికి బహుమతిగా ఇవ్వవచ్చు. ఆ తర్వాత గిఫ్ట్ పొందిన వ్యక్తి దానిని ఉపయోగించి మ్యూచవల్ ఫండ్స్‌లో యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా సరే తమ స్నేహితులు, కుటుంబసభ్యులకు ఈ రూపంలో గిఫ్ట్ ఇవ్వొచ్చు.
ఈ ప్రతిపాదనలపై ఏప్రిల్ 14వ తేదీలోగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రజలను సెబీ కోరింది. ప్రజల సూచన తర్వాత ఈ నిబంధనలను సెబీ ప్రవేశపెట్టనుంది. దీంతో త్వరలోనే ఈ అవకాశం మనం పొందవచ్చు. అయితే ఈ గిఫ్ట్ కార్డులు జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఇక వీటికి ఎలక్ట్రానిక్ బ్యాంక్ బదిలీ, యూపీఐ ద్వారా మాత్రమే నిధులు సమకూర్చబడతాయని సెబీ తెలిపింది.
ఇక గిఫ్ట్ కార్డుల ద్వారా చేసే పెట్టుబడులకు ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేల పరిమితి అమల్లో ఉంటుంది. ఆ పరిమితి దాటితే లావాదేవీని రద్దు చేస్తారు. ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో గిఫ్ట్ ద్వారా చేసిన లావాదేవీలను పర్యవేక్షిస్తారు. ప్రతీ పెట్టుబడిదారుడు గిఫ్ట్ పీపీఐలు, ఈ వ్యాలెట్లు, నగదు ద్వారా ఎంత పెట్టుబడి పెట్టారనేది ట్రాక్ చేస్తారు.
రిటైల్ కొనుగోళ్ల కోసం గిఫ్ట్ కార్డులు, ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు పరిష్కరాలను చూపిస్తాయి. గిఫ్ట్ కార్డులతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే విధానంపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నుంచి సెబీకి ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదతో సెబీ ముందడుగు వేసింది. త్వరలోనే ఈ మార్పును మనం చూడవచ్చు.




