
వడోదర: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ ఆతిథ్య భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. వన్డేల్లో గెలిచి రానున్న టి20 సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధం కావాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో పోల్చితే భారత్‌కే గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా బలోపేతంగా ఉంది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జట్టుకు కీలకంగా మారారు. టెస్టులు, టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. రానున్న వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు సంపాదించాలంటే ఈ సిరీస్‌లో సత్తా చాటాల్సిన పరిస్థితి రోకోలకు నెలకొంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన సిరీస్‌లలో వీరిద్దరు మెరుగైన బ్యాటింగ్‌తో అలరించారు.
కివీస్‌పైన కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉన్నారు. ఇక గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు కూడా జట్టులోకి వచ్చారు. వీరికి కూడా సిరీస్ కీలకంగా మారింది. ఇందులో రాణించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చేరడంతో జట్టు బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. అయితే యశస్వికి తుది జట్టులో చోటు లభిస్తుందా లేదా అనేది సందేహమే.ఇక రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు ఉండనే ఉన్నారు. కిందటి సీజన్‌లో రాహుల్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
సౌతాఫ్రికా సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాడు. పంత్ కూడా వన్డే టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సుదీర్ఘ విరామం తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. అతనిపై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సిరీస్ కీలకంగా మారింది. జట్టులో స్థానాన్ని కాపాడు కోవాలంటే ఇందులో తప్పక రాణించాల్సిన అవసరం అతనికి నెలకొంది. ఈసారి విఫలమైతే జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమే. సిరాజ్, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న భారత్ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.