
కోల్‌కతా /న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా అవినీతి , కోల్‌స్కామ్ లోగుట్టు తన వద్ద ఉందని, దీనిని పెన్ డ్రైవ్‌లో ఉంచామని , నిజాలు తేలుతాయని హెచ్చరించారు. బొగ్గు కుంభకోణం మూలాలన్నింటిని వె లుగులోకి తేవడం జరుగుతుందని తెలిపారు. ఐ ప్యాక్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు దాడులు, ఈ క్రమంలో అక్కడికి ఒక్కరోజు క్రితం మమత బెనర్జీ, అంతకు ముందు కోల్‌కతా నగర పోలీసు కమిషనర్ దూసుకువెళ్లడం వంటి పరిణామాలు బెంగాల్‌లోనే కాకుండా దేశవ్యాప్త దుమారానికి దారితీశాయి. శుక్రవారం ఓ వైపు టిఎంసి ఎంపిల బృందం అమిత్ షా కార్యాలయం వద్ద ధర్నాకు దిగింది. మరో వైపు కోల్‌కతాలో టిఎంసి ఆధ్వర్యంలో పది కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మమత బెనర్జీ ప్రజలను ఉద్ధేశించి మమత బెనర్జీ ఘాటుగా ప్రసంగించారు. దేశంలో భారీ కోల్ స్కాం జరిగింది.
దీని ద్వారా దక్కిన అక్రమ సొమ్ము అంతా అమిత్ షా సొంతానికి బెంగాల్ బిజెపి ఎంపి జగన్నాథ్ సర్కారు, అసెంబ్లీలో బిజెపి నేత సువేంధు అధికారి ద్వారా చేరాయని మమత ఆరోపించారు. చాలా కాలం క్రితమే తనకు ఈ విషయం తెలు సు . అయితే హోం మంత్రి కుర్చీ పట్ల తనకు ఉన్న గౌరవం వల్ల ఇంతకాలం మౌనంగా ఉన్నానని, వివరాలు అన్నీ కూడా పెన్ డ్రైవ్‌లో ఉన్నాయని , ఇక అమిత్ షా గుట్టు తీసి గట్టున పెట్టే సమయం వచ్చిందని తెలిపారు. తనను తన ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని, ఇది రాజకీయ కక్ష సాధింపు అని, అయితే ఇది పరిమితి దాటితే , తమ సహనం నశిస్తే ఊరుకునేది లేదని మమత నేరుగా అమిత్‌షాకు హెచ్చరికలు వెలువరించారు. తాను పేర్కొంటున్న జగన్నాథ్ సర్కార్ బందిపోటు, సువేంధు అధికారి గద్దార్ అని వ్యాఖ్యానించారు. వీరు దోచుకున్న సొమ్మంతా అమిత్ షాకు చేరిందన్నారు. ఇడి సోదాలను అడ్డుకోవడానికి వెళ్లడంపై స్పందించారు. ఇందులో తప్పేమీలేదన్నారు. రాజకీయ కక్షసాధింపులతో సాగిన దాడిని పార్టీ అధినేతగా , బాధిత పక్షం తరఫున తాను అక్కడికి వెళ్లి ప్రతిఘటించానని చెప్పారు. ఇడి ఇతర దర్యాప్తు సంస్తలు బిజెపి రాజకీయ పనిముట్లుగా పనిచేస్తున్నాయని విమర్శించారు.
ఉదయం ఆరు గం టల నుంచి దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇడి సోదాలు జరిగాయి. తాను అక్కడికి వెళ్లేలోగా ఎన్ని కీలక ఫైళ్లు వారు మాయం చేశారో తెలియదు. ప్రత్యేకించి టిఎంసి ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన ఫైళ్లను ఇడి ఎత్తుకెళ్లి బిజెపి వర్గాలకు అందించి ఉంటుందని ఆరోపించారు. సర్ ఇతర దొడ్డి దారి మార్గాలతో ఇతర రాష్ట్రాలలో ప్రజా తీర్పును బిజెపి హైజాక్ చేసిందని, బెంగాల్‌ను కూడా ఈ విధంగా కాజేయాలని చూస్తోందని తెలిపారు. అయితే దాడులకు , దర్యాప్తు సంస్థల తంతులకు బెదిరేది లేదు. రా జకీయ దాడులు తన సంకల్ప బలాన్ని మరింత పెంచుతాయని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఇతరత్రా ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా, ప్రజాబలం ముందు దిగదుడుపే అన్నారు.