Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభు త్వం సీరియల్ స్నాచర్‌లా వ్యవహరిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. అన్ని యూనివర్సిటీ భూములను గుంజుకోవడం ఒక ప్రక్రియ పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా వ్యవహరిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. మౌ లానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూ ములకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం నందినగర్‌లో వి ద్యార్థులతో కెటిఆర్ సమావేశమయ్యారు. అనంత రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు తలమానికంగా ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అ న్నారు.

విశిష్టమైన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కాంగ్రెస్ వాడాలనుకుంటుంద ని, 50ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమం గా తీసుకోవాలని చూస్తున్నదని చెప్పారు. ప్రభు త్వం భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కా దన్నారు. ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు పేరిట చెప్పి తీసుకున్నదని, 400ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నం చేసిందని ఆక్షేపించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అ యినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, ఇక్కడి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయ త్నం చేసిందని అన్నారు. విద్యార్థుల ఆందోళనలు, ప్రజల వ్యతిరేకత.. సుప్రీం కోర్టు జోక్యంతో తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వ్యవహారంలో పదివేల కోట్ల భూమి కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి విచారణ చేపట్టలేదని విమర్శించారు.

హెచ్‌సియు భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సెంట్రల్ యూనివర్సిటీ అయిన ఉర్దూ యూనివర్సిటీ భూములపైన కన్ను వేసేది కాదని పేర్కొన్నారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే తమ ప్రభుత్వంలో యూనివర్సిటీ విస్తరణ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఢిల్లీలో పోరాటం చేయాల్సి వస్తే అండగా ఉంటామని చెప్పారు. ఈ అంశాన్ని అవసరమైతే రాజ్యసభలో తమ పార్టీ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారని చెప్పారు. యూనివర్సిటీ భూములపైన కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను వేయడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థల భూములను, రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. తాజాగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఐఎస్‌బి భూములను కూడా గుంజుకునే కుట్రలో ప్రారంభించిందని ఆరోపించారు. దేశంలో మైనార్టీల సంరక్షకుడిని అని చెప్పుకునే రాహుల్ గాంధీ, ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమే కాపాడడమా..? అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మొహబ్బత్‌కి దుకాణం అని చెప్తున్నది ఇదేనా..? అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీల సమస్యలపైన రాహుల్ గాంధీ మాట్లాడాలని అన్నారు. భూములు గుంజుకుంటున్న వారి ప్రభుత్వం పైన స్పందించకపోవడం దారుణం అని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఉన్న భూములు ఖాళీ ఉన్నవి కావు అని, భవిష్యత్తు విస్తరణ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్టను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. గతంలో ఇదే యూనివర్సిటీ ప్రజా అవసరాల కోసం హైదరాబాద్ నగరం కోసం 32 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇచ్చారని, కాజాగూడ నుంచి నానక్‌రామ్ గూడకు లింక్ రోడ్డు కోసం ఏడెకరాల స్థలాన్ని యునివర్సిటీ భూమి ఇచ్చారని గుర్తు చేశారు.హైదరాబాద్ నగర ప్రయోజనాలకు అవసరమైనప్పుడు భూసేకరణను ఏనాడు వ్యతిరేకించలేదని చెప్పారు.గతంలో తెలంగాణలో జరిగిన ఉద్యమం వల్లనే హైదరాబాద్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమాలు త్యాగలా ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ కోసం వాడడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో తాము నిజాం కాలేజీలో హాస్టల్ లేదు అంటే ప్రభుత్వ నిధులతో హాస్టల్ నిర్మించామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి అండగా ఉంటామని, కావలసిన విస్తరణ సౌకర్యాలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నోటిఫికేషన్లు ఏవి అని నిరుద్యోగులు నిలదీసినందుకు వారిని దారుణంగా తిడుతూ లాఠీ ఛార్జ్ చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులు విద్యార్థులపైన జరిగిన లాఠీ ఛార్జీని కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశం పైన స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు విద్యార్థులపైన పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌లో బట్టల దుకాణం, సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి పోతున్నారని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషనులు తిప్పుతున్నారని విమర్శించారు. ఆరేడు పోలీస్ స్టేషన్లు తిప్పి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ విద్యార్థి విభాగం నిరుద్యోగ యువతకు అండగా ఉంటుందని కెటిఆర్ భరోసా ఇచ్చారు.