Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: సినిమా టిక్కెట్ల రిలీజ్ ధరల పెంపు వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ది రాజాసాబ్ టిక్కె ట్ల ధరల పెంపుపై దాఖలయిన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించింది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారన్న న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భం గా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టిక్కె ట్ల ధరలు పదే పదే ఎందుకు పెంచుతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా టిక్కెట్ల ధరలు పెం చాలనే ఆలోచన మారదా అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ధరలు పెం చవద్దని గతంలో చెప్పామని, అయినా అధికారులు పెంచారని, టిక్కెట్ల ధరల గురించి మా కు తెలుసని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జీఓలు ఇచ్చే అధికారులకు నిబంధనలు తెలియవా అంటూ హైకోర్టు ధర్మాసనం అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.

ది రాజా సాబ్ సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు సంబంధించిన జీఓను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్దరాత్రి విడుదల చేసింది. దీనిపై హైకోర్టు తీ వ్రంగా స్పందించింది. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ను కొట్టివేసింది. టికెట్ పెంపు విషయంలో హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. జిల్లా స్థాయి కలెక్టర్లు, హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్ మాత్రమే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం పెద్ద సినిమాల సమయంలో తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని జీపిని ప్రశ్నించింది. ఇటీవల టికెట్ల ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించారని, అయినా పదే పదే టికెట్ల ధరల పెంపునకు ఎందుకు అనుమతిస్తున్నారని ధర్మాసనం అడిగింది. టికెట్ రేట్ల మెమో గురించి విచారణ జరగటం ఇది మొదటిసారి కాదని, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన తీరు మారడం లేదని ప్రశ్నించింది.

ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ మొత్తం ఒకే టికెట్ ధర ఉండేది, కానీ ఇప్పుడు ప్రతిసారి టికెట్ ధరలు పెంచుతూ పోతున్నారు. దీని వల్ల సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.మేము కూడా సినిమాలకు వెళ్లాం, మాకూ టికెట్ ధరలు తెలుసు అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ టికెట్ల ధరల నిర్ణయం సరిగా లేదన్నారు. ఒక్కో సినిమాహాల్లో ఒక్కో విధంగా మౌలిక సదుపాయాలున్నాయని న్యాయస్థానానికి వివరించారు. అత్యాధునిక థియేటర్లలోనూ సాధారణ టికెట్ల ధరలే నిర్ణయించారన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే పెంచుకోవడానికి మెమోలిస్తున్నారని తెలిపారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుకొని టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తే కొత్త జీఓ విడుదల చేయాలని సూచించింది. గతంలోనే ఓజీ, అఖండ2, పుష్ప2 వంటి సినిమాల విషయంలో మొట్టికాయలు వేశామని, అయినా మారడం లేదని ప్రభుత్వంపై సీరియస్ ధర్మాసనం అయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.