
మాస్కో: రష్యాఉక్రెయిన్ మధ్య రావణ కాష్ఠం రగులుతోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై తాజాగా అత్యాధునిక ఒరెష్నిక్ ( హేజల్‌నట్ )క్షిపణితో రష్యా దాడి చేసింది. ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ క్షిపణిని గురువారం అర్ధరాత్రి పశ్చిమ లివిన్ ప్రాంతంపై ప్రయోగించింది. ఇది ప్రతీకార దాడిగా రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అయితే కచ్చితంగా ఏ ప్రదేశాన్ని లక్షంగా చేసుకుని ఈ దాడి జరిగిందో మాస్కో వివరాలు వెల్లడించకపోయినా, ఈ క్షిపణితో కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఉక్రెయిన్ భూగర్భసహజ వాయువు నిల్వలపై ఈ దాడి జరిగినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారులు స్పందించారు. నలుగురు ప్రాణాలు కోల్పోగా, 22 మంది గాయపడ్డారని తెలిపారు. ఒరెష్నిక్‌తోపాటు మొత్తం 36 క్షిపణులు, 242 డ్రోన్లను రష్యా ప్రయోగించినట్టు కీవ్ ఆరోపించింది. నాటో సరిహద్దుకు సమీపంలో ఒరెష్నిక్ పడిందని, ఐరోపా భద్రతకు ఇది పెనుముప్పుఅని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.
ఐరోపా మొత్తాన్ని టార్గెట్ చేసేలా …
రష్యా అత్యాధునిక క్షిపణుల్లో ఒకటైన ఒరెష్నిక్ గంటకు 13,000 కిమీ వేగంతో ప్రయాణించగల మధ్యస్థాయి క్షిపణి. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగంగా దూసుకెళ్తుంది. యూరప్ లోని అన్ని దేశాలు ఈ క్షిపణి పరిధి లోకి వస్తాయని రష్యా మిస్సైల్ ఫోర్సెస్ చీఫ్ వెల్లడించారు. ఇప్పటివరకు ఈ క్షిపణిని అడ్డుకునే సామర్థం ఏ ఆయుధానికి లేదన్నారు. మొట్టమొదటిసారి ఈ క్షిపణిని 2024 నవంబరులో ఓ ఉక్రెయిన్ ఫ్యాక్టరీ మీద ప్రయోగించారు. అప్పట్లో అది ఇంకా అభివృద్ధి దశ లోనే ఉంది. ఇటీవలనే దీన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. రష్యామిత్రదేశమైన బెలారస్‌కు ఈ మిస్సైల్‌ను తరలించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అణుబాంబులతోపాటు అనేక వార్‌హెడ్‌లను ఇది మోసుకెళ్లగలదు. ఒరెష్నిక్ అంటే రష్యన్ భాషలో హేజల్‌నట్ చెట్టు అని అర్థం.