
దంతేవాడ: ఛత్తీస్‌గఢ్ లోని దంతేవాడ జిల్లాలో 63 మంది నక్సల్స్ లొంగిపోయారని , వీరిలో 36 మందిపై మొత్తం రూ.1.19 కోట్ల వరకు నగదు బహుమతి ప్రకటించి ఉందని సీనియర్ పోలీస్ అధికారి శుక్రవారం వెల్లడించారు.18 మంది మహిళలు కూడా ఉన్న ఈ క్యాడర్ తమకు తామే పునరావాసం నుండి సామాజిక పునరేకీకరణ చొరవ కింద సీనియర్ పోలీస్, సిఆర్‌పిఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని దంతేవాడ ఎస్‌పి గౌరవ్ రాయ్ చెప్పారు. దక్షిణ, పశ్చిమ బస్తరు రీజియన్లలోను, మాడ్ డివిజన్ లోనూ చురుకుగా నక్సల్ కార్యకలాపాలు సాగించేవారని తెలిపారు.
వీరిలో ఏడుగురిపై రూ. 8 లక్షల వంతున రివార్డు ఉండగా, మరో ఏడుగురిపై రూ.5 లక్షల వంతున, ఇంకా ఎనిమిది మందిపై రూ.2 లక్షల వంతున రివార్డు ఉందని తెలిపారు. ప్రస్తుతం వీరందరికీ తక్షణం రూ.50 వేలు వంతున ఆర్థిక సాయం అందుతుందని, తరువాత ప్రభుత్వ విధానం ప్రకారం పునరావాసం కల్పిస్తామని ఎస్‌పి చెప్పారు.పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో ఈనెల 7న 26 మంది నక్సల్స్ పోలీసులకు లొంగిపోయారు.