Reading Time: < 1 minute

 రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 5.14లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలోని రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులు మా కుటుంబ సభ్యులుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తుందని వివరించారు. 1.02 కోట్ల ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు

రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిసినట్టు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తూ వస్తున్నామని ఆ ప్రకటనలో వివరించారు. ఉద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రభుత్వం చొరవతో చేపట్టిన కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమా కార్యక్రమంతో ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు వీరితోపాటు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 1.02 కోట్ల ప్రమాద బీమాను అమలులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు.