
టెహ్రాన్: ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీఖమేనీ ఆందోళన కారులను హెచ్చరించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించే ప్రసక్తే లేదన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ఇతర దేశాలకు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.ఇతర దేశాధ్యక్షుడిని సంతోష పెట్టేందుకు సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారంటూ ఆందోళన కారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి (గతంలో అమెరికా మద్దతుతో దేశాన్ని పాలించిన షా వారసుడు) ఇచ్చిన పిలుపు మేరకు ఇరాన్‌లో ఆందోళన కారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. గురువారం మొదలైన ఈ నిరసనలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. ఇంటర్నెట్,టెలిఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసినప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం. ఈ నేపథ్యం లోనే స్పందించిన సుప్రీం లీడర్.. యువత ఏకతాటిపై ఉండాలని, దేశం ఐకమత్యంగా ఉన్నప్పుడే ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోవచ్చన్నారు.