
తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేది లేదని నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 8 కోట్లతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, డివిజన్ కార్యాలయం, రూ.25 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు బిల్డింగ్, రూ.5.10 కోట్లతో నిర్మిస్తున్న ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం పనుల పురోగతిని స్థానిక ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తో కలిసి పరిశీలించి పనులు నాణ్యతతో నిర్మిస్తూ, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా నది నీటి పంపకాల్లో గత ప్రభుత్వం తెలంగాణకు 34 % (299 టిఎంసిలు), ఆంధ్రకు 66 % (512 టిఎంసిలు) అంగీకారం చేసుకోవటం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు నష్టపోయాయని తెలిపారు. అయితే, తమ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కృష్ణా జలాలో 71 % తెలంగాణకు దక్కేలా పోరాడుతున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్లలో రూ.17 లక్షల కోట్ల బడ్జెట్‌లో నీటి పారుదల రంగానికి రూ.1.83 లక్షల కోట్ల కేటాయించినప్పటికీ కృష్ణా నదిపై తలపెట్టిన పాలమూరు=రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కొడంగల్, నారాయణపేట, డిండి, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయలేదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్ట్‌లు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే మూడేళ్లలో కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల నష్టపోయిన కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాలసిన వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని వాటా కోసం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, నది ట్రిబ్యు నల్స్ ముందు బలమైన వాదనలు వినిపించి సాధిస్తామని తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న రెడ్ల కుంట లిఫ్ట్ ఇరిగేషన్, శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు వేగవంతంగా పూర్తి చేయాలని పాలేరు వాగుపై చెక్ డ్యాం, పాలవరం లిఫ్ట్ ఇరిగేషన్, నడిగూడెంలోని చౌదరి చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించిరు
. చిలుకూరు వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్‌పై డబుల్ బ్రిడ్జ్జి, పాలే అన్నారంలో బ్రిడ్జ్జి,పనులు త్వరగా ప్రారంభించి ఎండాకాలం చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మోతే లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ కోసం రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని ఆర్డిఓను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ సిఈ రమేష్ బాబు, ఎస్‌ఇ నాగభూషణం శివతేజ, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, ఆర్డీవోలు సూర్యనారాయణ, వేణుమాధవ్, తహసిల్దార్ వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.