
యూనివర్సిటీ భూములపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో కాకతీయ లేదా ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. మనూ యూనివర్సిటీ భూములపై అధికారులు, కలెక్టర్ స్పష్టత ఇచ్చారని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. అయినా కెటిఆర్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కెటిఆర్ చేసిన వ్యా ఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కెటిఆర్‌కు ధైర్యం ఉంటే యూనివర్సిటీలపై భూములపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేసిందన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఒక్క వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో మరన్ని నోటిఫికేషన్లు ఇస్తామని ఆయన తెలిపారు. బిసి రిజర్వేషన్లు, ఎస్‌సి వర్గీకరణ విషయంతోనే జాబ్ క్యాలెంటర్ ఆలస్యమైందని ఆయన చెప్పారు. ఈ విషయంలో కుల సంఘాలతో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాలు చేయలేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు కెసిఆర్, కెటిఆర్ కనీసం అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన వారిపై కేసులు పెట్టి జైలులో పెట్టించారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించలేదని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ తప్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయట పెడుతుంటే కెటిఆర్ దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు.