Reading Time: < 1 minute

హైదరాబాద్: తెలంగాణకు గొడవ కావాలా.. నీళ్లు కావాలా అంటే.. నీళ్లే కోరుకుంటా అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై ఆయన స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. వివాదం కావాలా.. పరిష్కారం కావాలా.. అంటే పరిష్కారమే కోరుకుంటా అని అన్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి ఆలోచన తమకు లేదని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారానికి సహకరించాలని, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందామని ఎపి సిఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఎపిలో కృష్ణాపై ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డం చెప్పకండి అని అన్నారు.

అడ్డంకులతో కేంద్ర నిధులు రావట్లేదని.. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. తాము వివాదం కోరుకోవట్లేదని.. పరిష్కారం కోరుకుంటున్నామని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలు కాదు.. ప్రజలు రైతుల గురించి ఆలోచిస్తున్నామని స్సష్టం చేశారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కోసం పక్క రాష్ట్ర సహకారం ఉండాలని అన్నారు. రెండు రాష్ట్రాలు సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు. పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవట్లేదని, సరిహద్దు రాష్ట్రాలతో పరస్పర సహకారమే కోరుకుంటున్నామని అన్నారు.