
అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్ లింగ్ యాక్ట్ ను రద్దు చేశామని ఎపి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పట్టాదారు పాసు పుస్తకాన్నిఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో సిఎం పర్యటించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారంపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సూచించారు. ప్రభుత్వం ఉంది వివాదాలను సృష్టించడానికి కాదు.. పరిష్కరించడానికి అని తెలియజేశారు. సర్వే రాళ్లపై మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోట్లు ఖర్చు పెట్టారని, వైసిపి హయాంలో రీ సర్వే పేరుతో గందరగోళం చేశారని విమర్శించారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో పెట్టుకున్నారని, పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు అన్నారు. మార్చికల్లా పోలవరం ఫేజ్-1 పనులు పూర్తి చేస్తామని, జగన్ వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమకు కావాల్సింది గొడవలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలని, పట్టిసీమ వస్తే గోదావరి జిల్లాలు ఎడారి అవుతాయని జగన్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు తప్పు చేసినా తాట తీస్తామని, వైసిపి హయాంలో గంజాయి విచ్చలవిడిగా దొరికేదని అన్నారు. ఎపిని జగన్ నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. టిటిడి పవిత్రతను కాపాడే బాధ్యత తనదని.. టిటిడి మద్యం బాటిళ్ల వ్యవహారంలోనూ వైసిపి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.