
సికింద్రాబాద్: వెస్ట్ మారేడుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. లెక్చరర్స్ తిట్టారని తీవ్ర మనస్తాపం చెందిన ఓ విద్యార్థి మృతి చెందింది. వెస్ట్ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని(17) ఎంఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం కళాశాలకు గంట ఆలస్యంగా రావడంతో లెక్చరర్స్.. తోటి విద్యార్థుల ఎదుటే ఆమెను మందలించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఇంటికి వెళ్లి విషయం తల్లితో చెప్పింది. తర్వాత వెళ్లి మాట్లాడుదామని తల్లి కుమార్తెను సముదాయించింది.
ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే మల్కాజ్‌గిరిలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి సిటి స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పని చేయలేదు. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురి కావడంతో మెదడులో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అనంతరం రాత్రి బాలిక మరణించింది. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు, ఎమ్మార్పిఎస్ నేతలు, ఒయు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.